మోర్తాడ్, జనవరి 9: నిజామాబాద్ జిల్లా రైతులు ఐక్యతతో సాగునీటి సమస్య పరిష్కరించుకున్నారు. గాండ్లపేట అక్విడెక్ట్ సమీపంలో వరద కాలువకు గత అక్టోబర్ 9న గండి పడింది. దీంతో ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల నిలిచిపోయింది. మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.8.52 కోట్లు మంజూరు చేసినా, పనులు పూర్తి చేయడానికి సమయం పడుతుంది.
యాసంగి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది. దీంతో అన్నదాతలు ఏకమై రైతు ఐక్యవేదికగా వరద కాలువకు రివర్స్పంపింగ్తో నీటిని తెప్పించాలని డిమాండ్ చేశారు. సొంత ఖర్చులతో మోర్తాడ్-గాండ్లపేట మధ్యలో పది మీటర్ల ఎత్తుతో 15 అడుగుల వెడల్పుతో మట్టికట్ట నిర్మించుకున్నారు. నాగాపూర్ వద్ద హెడ్‌రెగ్యులేటర్ గేట్లకు మరమ్మతులు చేయించారు.
రైతులు మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని నాలుగు రోజుల క్రితం కలిసి వివరించారు. దీంతో ఆయన ఇరిగేషన్ ఫ్లడ్‌ఫ్లో కెనాల్ సీఈ సుమతీదేవి, గాయత్రీ పంప్‌హౌస్ సీఈ శ్రీనివాస్‌గుప్తా, ఎన్పీడీసీఎల్ చైర్మన్ వరుణ్‌రెడ్డితో మాట్లాడారు. ఆయన విజ్ఞప్తి మేరకు శుక్రవారం తెల్లవారుజామున రివర్స్‌పంపింగ్ ద్వారా వరద కాలువకు నీటి విడుదల ప్రారంభమైంది.
జగిత్యాల జిల్లా రాజరాజేశ్వర్రావుపేట పంప్‌హౌస్ వద్దకు, అక్కడి నుంచి సాయంత్రానికి నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి వరకు చేరుకున్నాయి. వేములకు, అధికారులకు రైతులు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 2023 జూలైలో వర్షాభావంతో పరిస్థితుల్లో ఎస్సారెస్పీని నింపేందుకు మొదటిసారి రివర్స్‌పంపింగ్ చేయగా, ఇప్పుడు కాలువకు గండి పడగా రెండోసారి రివర్స్ పంప్ చేస్తున్నారు.