మోర్తాడ్, జనవరి 9: ‘నిజామాబాద్ జిల్లాలో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇలాగైతే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు’ అని కాంగ్రెస్ నేతలు రైతు సంక్షేమ కమిషన్ ఎదుట వాపోయారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని పసుపు పరిశోధనా కేంద్రాన్ని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గురువారం సందర్శించారు. స్టాళ్ల వద్దకు వచ్చిన కమిషన్ సభ్యులు పసుపు వంగడాలు, యంత్రాలను పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులందరికీ రుణమాఫీ చేయాలని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులు వినతిపత్రం ఇచ్చారు. జిల్లాలో సగం కంటే ఎక్కువ మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉందని చెప్పారు.
ఈ ప్రాంతంలో పెద్ద రైతులు ఉన్నందున బ్యాంకుల్లో రూ.2 లక్షలకు పైగా రుణాలు తీసుకుంటారని, అటువంటి వారందరికీ రుణమాఫీ చేయించాలని, రుణమాఫీ చేయకపోతే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితిలో లేమని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కోదండరెడ్డి రుణమాఫీ చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, కొన్ని ఇబ్బందుల కారణంగా చేయలేకపోయినట్లు వివరించారు. రుణమాఫీ గురించి పార్టీకి చెందిన రైతులే అడగడంతో ముఖాముఖిలోనూ ఇవే ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముందని భావించి రైతులతో భేటీ కాకుండానే వెనుదిరిగిపోయారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.