చారకొండ, జనవరి 31 : బ్లాక్ గ్రానైట్ తవ్వకాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరుసనగండ్ల శివారులోని 182 సర్వే నంబర్లో చేపడుతున్న బ్లాక్ గ్రానైట్ తవ్వకాల వద్దకు అన్నదాతలు చేరుకొని పనులను అడ్డుకున్నారు. ఈ తవ్వకాలతో తాము సాగు చేసిన పంటల్లో దుమ్ము ధూళి చేరి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన చెందారు.
పర్యావరణాన్ని కాపాడాల్సిన అధికారు లు కమీషన్ల కోసం అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, పనులు నిలిపివేయాలని కోరితే క్రిమినల్ కేసులు పెడ్తామని కాంట్రాక్టర్ బెదిరిస్తున్నారని బాధిత రైతులు వాపోయారు. బ్లాక్ గ్రానైట్ తవ్వకాలు నిలిపివేయాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.