కూసుమంచి, మే 14 : ‘సారూ.. కొనుగోలు కేంద్రాలకు లారీలు రావడం లేదు. వచ్చిన లారీలు టిక్కికి రూ.5 చొప్పున కమీషన్ అడుగుతున్నరు. తరుగు పేరుతో క్వింటాకు 5 నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తున్నరు’ అంటూ పాలేరుతండాకు చెందిన రైతు దంపతులు భూక్యా మంగ్యా, సక్కు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లా పాలేరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ క్రమంలో కొనుగోలు కేంద్రంలో మంగ్యాకు చెందిన లాట్ వద్ద ఏఈవో ప్రియాంకను మంత్రి ఉత్తమ్ తేమ శాతం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంగ్యా మాట్లాడుతూ ఐదు రోజుల క్రితం చింతకాని మండలం నామవరం వద్ద గల శ్రీనివాస మిల్లుకు 822 టిక్కిలు పంపించామని, వాటిలో క్వింటాకు 6 కిలోల చొప్పున తరుగు తీస్తామని ఇప్పుడు తనకు ఫోన్ చేశారని వాపోయారు.
‘శుక్రవారం వచ్చి మాట్లాడుతానని, తరుగు తీయొద్దని మిల్లర్లను కోరినా.. మీరు వచ్చినా.. రాకున్నా.. తరుగు తీయక తప్పదంటూ మిల్లర్లు సమాధానం ఇచ్చారు’ అని ఆయన మంత్రికి ఫిర్యాదు చేశారు. పాలేరుకు చెందిన 82 మంది రైతులు నర్సింహులగూడెంలోని చెందిన తెలంగాణ మిల్లుకు ధాన్యం వేశారని, వాటిల్లో 5 నుంచి 6 కిలోల తరుగు తీశారని రైతు సంఘం బాధ్యులు రమణారెడ్డి, బిక్కసాని గంగాధర్ మంత్రికి ఫిర్యాదు చేశారు. పాలేరుకు చెందిన రైతు కాలంగి రాహుల్ 616 బస్తాల ధాన్యం నర్సింహులగూడెంలోని తెలంగాణ మిల్లుకు వేస్తే.. అందులో నుంచి 13 క్విటాళ్ల 20 కిలోల తరుగు తీశారని వాపోయారు.
స్పందించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తక్షణమే ఆయా మిల్లుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని, వారి వద్ద ఉన్న కాగితాలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను నోట్ చేసుకోవాలని సూచించారు. మరికొందరు రైతులు కాంటా కాక, హమాలీలు రాక, వచ్చినా తరుగు పేరుతో కోత విధించడం, లారీలు దిగుమతి కాక వెయిటేజీ చార్జీకింద బస్తాకు రూ.5 నుంచి రూ.6 వరకు వసూలు చేస్తున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు. లారీలు, మిల్లర్ల వద్ద నుంచి వాటిని రికవరీ చేయాలని కలెక్టర్ దివాకర, సీపీ సునీల్ దత్‌ను మంత్రి ఆదేశించారు. లారీలు, కాంటా, హమాలీల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకే ఇక్కడికి వచ్చామని మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.