రఘునాథపాలెం, జూలై 4: ‘నా కొడుకు ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయండి సారూ..’ అంటూ ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు రైతు ప్రభాకర్ తండ్రి బోజెడ్ల వీరభద్రయ్య, కుమార్తె, కుమారుడు కూడా ఖమ్మం కలెక్టర్‌కు రెండు చేతులు జోడించి మొరపెట్టుకున్నారు.
చింతకాని మండలం ప్రొద్దుటూరు రైతు బోజెడ్ల ప్రభాకర్ తన సాగు భూమిని కొందరు ఆక్రమించడం, మత్స్య సొసైటీ బాధ్యులు జేసీబీతో తవ్వడంతో ఖమ్మం కలెక్టరేట్లో ఫిర్యాదు ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ అతడి కుటుంబ సభ్యులు.. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి గురువారం ఖమ్మం కలెక్టరేట్‌కు వచ్చారు.
పట్టాదారు పాస్‌పుస్తకాల ఆధారంగా తమ భూమిని తిరిగి తమకు ఇప్పించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌ను వేడుకున్నారు. ఆత్మహత్యకు బాధ్యులైన వారిని శిక్షించాలని విన్నవించారు. స్పందించిన కలెక్టర్.. సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : జడ్పీ చైర్మన్
కలెక్టర్‌ను కలిసి బయటకు వచ్చిన అనంతరం ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల , టీఎస్ సీడ్స్ మాజీ చైర్మన్ కొండబాల మీడియాతో మాట్లాడారు. రైతు ప్రభాకర్ భూమిని చెరువులో కలిపి అతడి ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన పిల్లల పరిస్థితి చూసి ప్రతి ఒక్కరూ చలించిపోతున్నా ఆకుటుంబాన్ని ప్రభుత్వం పరామర్శించకపోవడం విచారకరమన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.