ఖమ్మం, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం వరద బాధితుల ను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి కూడా ముంపు బాధితులను ఆదుకోలేకపోయారని, వారంతా అసమర్థ మంత్రులేనని దుయ్యబట్టారు. మున్నేరువరదలపై ప్రభుత్వానికి ముందు జాగ్రత్త లేకపోవడం వల్లే ఇంతటి నష్టం వాటిల్లిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, పుట్టెడు దుఃఖంతో ఉన్న ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం వారు పర్యటించారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ..మున్నేరు వరదపై ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. వరదల్లో మృతిచెందిన వ్యక్తుల కుటుంబానికి ఒక్కొక్కరికీ 25 లక్షల చొప్పున పరిహారం అందించాలని, కుటుంబానికీ 2 లక్షల తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎంపీ వద్దిరాజు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఇళ్లన్నీ బురదతో నిండి ఉన్నాయని, పాములు సంచరిస్తున్నాయని తెలిపారు. సర్వం కోల్పోయి రోడ్డున పడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీని నమ్మిన ఖమ్మం ప్రజలను నట్టేట ముంచారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. వరద సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సోమవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలమవుతుంటే సీఎం ఏం చేస్తున్నాడంటూ ప్రశ్నించారు. వరదల్లో చికుకుపోయిన వారిని రక్షించేందుకు బడే భాయ్‌ని హెలికాప్టర్ పంపించమని అడిగే తీరిక సీఎంకు లేదా అంటూ నిలదీశారు. ప్రజలు వరదల్లో చికుకున్న తర్వాత రోజు తీరిగ్గా సీఎం బయటకు వచ్చాడని, ఖమ్మం వరదల్లో చికుకున్న తొమ్మిది మందికి రాష్ట్ర ప్రభుత్వ సాయం లభించక పోవడం సిగ్గుచేటని విమర్శించారు.