జగిత్యాల, జూన్ 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు పట్టింపులేమితో పల్లెల్లో పచ్చదనం పాలిపోతున్నది. ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా గత సీఎం కేసీఆర్ గ్రామాలకు నెలనెలా ఇచ్చిన గ్రీన్ బడ్టెట్‌తో పచ్చలహారంగా మారిన రాష్ట్రం, ఏడాదిగా కళతప్పుతున్నది. బృహత్తర హరితహారం కార్యక్రమాన్ని ఎత్తేసి, వనమహోత్సవాన్ని చేపట్టిన ప్రభుత్వం, దానికి ఆదిలోనే మంగళంపాడింది. పంచాయతీలకు నిధులివ్వకపోవడంతో కనీసం నర్సరీలనూ నిర్వహించలేని దుస్థితి నెలకొన్నది.
కేసీఆర్ సర్కారు హయాంలో ఏటా మొక్కలు నాటి పల్లెలు, పట్టణాలను గ్రీన్కారిడార్లోకి తెచ్చేందుకు, అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు విశేషంగా కృషి చేశారు. ఫలితంగా తెలంగాణ పచ్చదనంతో పరిఢవిల్లింది. అటవీ విస్తీర్ణం పెరిగింది. పల్లె, పట్టణ ప్రకృతివనాలు, బృహత్ ప్రకృతి వనాలతో కొత్త అందాలను సంతరించుకున్నది. రెండేండ్ల క్రితం వరకు ఏ పంచాయతీ పరిధిలోని నర్సరీని చూసినా వేలాది పూలు, పండ్లు, అరుదైన జాతుల మొక్కలతో ఆహ్లాదంగా కనిపించేది. నేడు ఆ పరిస్థితులు పోయాయి.
కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్‌బడ్జెట్, గ్రీన్‌ఫండ్, గ్రీన్స్కాడ్ పేరుతో గ్రామాల్లో నర్సరీలను వృద్ధిచేసి పచ్చదనాన్ని పెంచితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధమైన చర్యలు చేపడుతున్నది. పంచాయతీలకు 16 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విదిల్చడం లేదు. బీఆర్ఎస్ హయాంలో ఒక్కో పంచాయతీకి కేటాయించిన నిధుల్లో పది శాతంగ్రీన్బడ్జెట్కు కేటాయించేవారు. నేడు రూపాయి కూడా రాకపోవడంతో నర్సరీల నిర్వహణ కష్టంగా మారింది. వనమహోత్సవం కోసం ప్రతి పంచాయతీకి మొక్కల పెంపకం టార్గెట్ పెట్టినా నిధుల్లేక మొక్కలు తెప్పించడంపై కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు.
దూర ప్రాంతాల నుంచి మొక్కలు కొనుగోలు చేసి తీసుకురావడం ప్రయాసగా మారింది. దీంతో చాలా నర్సరీలు మొక్కలు లేకుండా కనిపిస్తున్నాయి. ఈ విషయమై పంచాయతీ అధికారులు మాట్లాడుతూ ‘ఏం చేయమంటారు? ఒకప్పుడు నిధులు వచ్చేవి. గ్రీన్ బడ్జెట్ పదిశాతం ఉండేది. ఎంతైనా ఖర్చు పెట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు రూపాయి కూడా రావడం లేదు. సపాయిలకే జీతాలు సరిగా ఇస్తలేం. చెత్త తరలించే ట్రాక్టర్లు, ఆటోలకు డీజిల్, కరెంట్ బిల్లులు చెల్లించలేని దుస్థితి ఉన్నది. పెన్నులు, పెన్సిల్లు, తెల్లకాగితాలు కొందామన్నా తిప్పలవుతున్నది. ఇప్పటికే జేబుల నుంచి పెట్టీపెట్టీ దుఃఖం వస్తున్నది. ఇక నర్సరీలను ఎట్లా నిర్వహించుమంటరు’ అంటూ వాపోయారు.