మోర్తాడ్, జూన్ 2: తెలంగాణ అస్తిత్వంపై ఏపీ నేతలు మరోసారి కుట్రలకు తెరలేపారని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. బాల్కొండలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన రాష్ర్టావతరణ వేడుకలో జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదనే టీటీడీపీ నేత బక్కని నర్సింహులు వ్యాఖ్యలను సీఎంగా రేవంత్‌రెడ్డి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.
బీజేపీ కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో లేరనే కొందరు నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నరేంద్రమోదీ, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, పవన్‌కళ్యాణ్ ఒక్కటై తెలంగాణ ఉనికిని లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని, ఈ క్రమంలోనే పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని స్పష్టంచేశారు. తెలంగాణపై సోయిలేని వ్యక్తుల పాలన కొనసాగుతున్నదని, అందుకే వారి ఆగడాలు నడుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.