హైదరాబాద్, జనవరి 27(నమస్తే తెలంగాణ): అరబ్ దేశాల్లో నియంతల విలాసవంత భవనాలు.. బంగారంతో చేయించిన బాత్రూమ్లు ఉన్నట్టు విన్నాం. ఇప్పుడు ఇంచుమించు ఇదే తరహాలో రాష్ట్రంలో కూడా మంత్రుల నివాసాల్లో విలాసవంతమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఓ మంత్రి క్వార్టర్లో బాత్రూం రిపేర్లు, ఇతర సివిల్ పనులకు ఏకంగా రూ.76లక్షలు విడుదల చేయడమే ఇందుకు నిదర్శనం. సొంత భవనాల్లో విలాసాలకు సొంత డబ్బు ఖర్చుచేసుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. కానీ ప్రభుత్వం కేటాయించే క్వార్టర్లలో ప్రజాధనంతో విలాసాలు సమకూర్చడం సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది.
బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని మంత్రుల నివాస సముదాయంలోగల క్వార్టర్ నెంబర్-29లో శానిటరీ, సివిల్ పనులకు రూ.76లక్షలు మంజూరు చేస్తూ మంగళవారం ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీచేశారు. ఆర్అండ్బీ సీఈ ప్రతిపాదన మేర కు ఈ నిధులు విడుదలయ్యాయి. ఇటీవలే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లోని మినిస్టర్స్ క్వార్టర్స్ నంబర్-30లో బీరువా (వార్డ్రోబ్)తోపాటు దానికి సం బంధించిన కొన్ని సివిల్ పనుల కోసం ఏకంగా రూ.30లక్షలు విడుదల చేయడం సర్వత్రా చర్చనీయాంశం కావడం తెలిసిందే.
తాజాగా మరో మంత్రి క్వార్టర్ బాత్రూమ్ రిపేర్లకు ఏకంగా రూ.76లక్షలు విడుదల చేయడం చూస్తుంటే ప్రజలసొమ్ము మంత్రుల విలాసాల పాలవుతున్నట్టు అవగతమవుతున్నది. పేదల కోసం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు ఒక్కో ఇం టికి రూ.5లక్షలు ఖర్చుచేస్తున్న ప్రభు త్వం, తమ మంత్రుల క్వార్టర్లలో బీరువాలు, బాత్రూమ్ల రిపేర్లకు మాత్రం లక్షలు ఖర్చుచేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.