ఖైరతాబాద్, నవంబర్ 10: రాష్ట్రంలో ముదిరాజ్ సమాజమంతా బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలంగాణ ముదిరాజ్ మహాసభ విద్యావంతుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ సీహెచ్ దినేశ్‌కుమార్ ముదిరాజ్ వెల్లడించారు. ఈ మేరకు ముదిరాజ్ మహాసభ ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్తో కలిసి మాట్లాడారు. స్వాతంత్య్రానంతరం ఏ ఒక్క ముఖ్యమంత్రి ముదిరాజ్‌లను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ నేత కేసీఆర్ సీఎం అయ్యాక ముదిరాజ్‌ల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు నింపి ఉచితంగా రొయ్యలు, చేపలను వదిలి మత్స్యకారులందరినీ ఆదుకున్నారని తెలిపారు.
2013-14 వరకు మత్స్యకారుల సభ్యత్వాలు కేవలం 2 లక్షల మాత్రమే ఉండేదని, ప్రభుత్వ ప్రోత్సాహంతో 6 లక్షలకు పెరిగిందని, గతంలో 2,500 సొసైటీలు ఉండగా, నేడు 6,000కు పైగా ఏర్పాటు చేసుకున్నామని, మత్స్యకారుల ఆదాయం రూ.2,479 కోట్లు ఉంటే నేడు సీఎం కేసీఆర్ చొరవతో రూ.7,255 కోట్లకు పెరిగిందని వివరించారు. మత్స్యకారులకు వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించి 75 శాతం సబ్సిడీతో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, ఫోర్ వీలర్స్ అందజేయడంతోపాటు ఎన్నో సంక్షేమ ఫథకాలను వర్తింపజేశారని తెలిపారు. 2014లో తెలంగాణ ప్రభుత్వంలో ముదిరాజ్‌లకు మంత్రి పదవులు ఇచ్చారని, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాశ్‌ను రాజ్యసభకు పంపారని, నేడు ఆయనను శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా నియమించి సమున్నతస్థానం కల్పించారని చెప్పారు. ముది రాజ్‌ల సంక్షేమానికి మరింత పాటుపడుతారన్న నమ్మకం ఉన్నదని తెలిపారు. ఇంతగా పాటుపడిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముదిరాజ్ సమాజం అండగా నిలువాలని సంకల్పించిందని తెలిపారు. సమావేశంలో మహాసభ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్ ముదిరాజ్, హైకోర్టు న్యాయవాది చంద్రశేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.