హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యకు ఇచ్చే బడ్జెట్ మొత్తం టీచర్ల జీతాలకే సరిపోతుంది. 98% బడ్జెట్ జీతాలకు వెళుతున్నది. ఈ వ్యాఖ్యలన్నదెవరోకాదు సా క్షాత్తు సీఎం రేవంత్రెడ్డి. తాజా రాష్ట్ర బడ్జెట్లో సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి, సీఎం హోదాలో పాఠశాల విద్యకు అరకొర నిధులే కేటాయించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం రూ. 20వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. దీంట్లో 16వేల కోట్లు నిర్వహణ పద్దు కిందే ఖర్చుచేయనున్నది.
అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే జీతాలకే బడ్జెట్ కేటాయింపులు చేసిందన్నమాట. నిర్వహణ వ్యయం కింద పాఠశాల విద్యకు 2024-25లో 14వేల కోట్లు, 2025-26లో 16వేల కోట్లు కేటాయించగా, ఈ ఏడాది కూడా 16వేల కోట్లే కేటాయించింది. ఉన్నత విద్యకు ఈ బడ్జెట్లో రూ. 4,650 కోట్లు ఇవ్వగా, దీంట్లో రూ. 2,724 కోట్లు నిర్వహణ పద్దు కిందే ఖర్చు చేయనున్నది.
సాంకేతిక విద్యాశాఖకు రూ. 685 కోట్లు కేటాయిస్తే, దీంట్లో 538కోట్లు నిర్వహణ పద్దు కిందే చూపించింది. విద్యకు కేటాయించే బడ్జెట్ మొత్తం జీతాలకు వెళుతుందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడంతో ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయని అంతా భావించారు. అయినా జీతాల వరకే బడ్జెట్ కేటాయించడంపై విద్యారంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.