హైదరాబాద్, మార్చి 29(నమస్తే తెలంగాణ): నిండు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి మరోమారు డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారు. బీఆర్ఎస్ లేవనెత్తిన అవినీతి ఆరోపణలపై సమాధానాలు చెప్పలేక దళితరాగం అందుకొని చర్చ పక్కదారి పట్టేందుకు స్కెచ్ వేశారు. నాడు తప్పుగా అనిపించింది, నేడు ఒప్పేనంటూ ప్రదర్శించిన ద్వంద్వ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మైనింగ్ అక్రమాలను బీఆర్ఎస్ అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టడంతో అధికార పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైంది. ఈ వివాదంలో ఇరుకున పడ్డ సర్కార్.. దీని నుంచి బయటపడేందుకు ఆదివారం కూడా నానా తంటాలు పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శలకు సమాధానం చెప్పలేక పాలకపక్షం తెల్లముఖం వేసింది.
ఆ అక్రమాల నుంచి దృష్టి మరల్చేందుకు, చర్చను పక్కదారి పట్టించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలి‘ట్రిక్స్’ ప్రయోగించారు. ఓవైపు మంత్రి పొంగులేటి అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని, ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పుడూ లేని విధంగా దళిత రాగాన్ని అందుకొన్నారు. ఇందులో భాగంగానే దళిత ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి మాట్లాడించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరితో మాట్లాడిస్తూ బీఆర్ఎస్పైకి ఎగదోశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి సైతం ప్రత్యేకంగా దళితుల అంశంపై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన గతంలో ఎప్పుడూ లేని విధంగా దళితులపై కపట ప్రేమను కనబరిచారనే విమర్శలొచ్చాయి. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం గతంలో ఏ ప్రభుత్వమూ ఏమీ చేయనట్టుగా ఈ రెండేండ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ చేసినట్టుగా చెప్పుకొచ్చారు. అసందర్భంగా దళిత నేతలైన స్పీకర్ ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు మరికొందరి పేర్లు ప్రస్తావిస్తూ వారిని పొగుడుతూ మచ్చిక చేసుకొనే ప్రయత్నం చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సీఎం రేవంత్‌రెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. భట్టి విక్రమార్క ఉన్నత విద్యావంతుడని, ఆయనకున్నంత తెలివి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఎవరికీ లేదని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో దళిత నేత అయిన భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఇచ్చామని, ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయన చేతుల్లో పెట్టినట్టు తెలిపారు. నాడు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటూ బీఆర్ఎస్ మోసం చేసిందని ఆరోపించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. భట్టి విక్రమార్క అత్యంత మేధావి అంటున్న రేవంత్‌రెడ్డి.. మరి ఆయన్నే సీఎంగా ఎందుకు చేయలేదని, సీనియర్ నేత, దళిత వర్గానికి చెందిన భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు సీఎంగా అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. భట్టి విక్రమార్కకు దక్కాల్సిన సీఎం పదవిని గుంజుకున్నది రేవంత్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి దళితులపై, దళిత నేత భట్టి విక్రమార్కపై నిజమైన ప్రేమ ఉంటే ఇప్పటికైనా సీఎం పదవి నుంచి తప్పుకొని భట్టి విక్రమార్కకు ఆ పదవి అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆయన చేతుల్లోనే ఉన్న పనిని చేయకుండా బీఆర్ఎస్పై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రేమను ఒలకబోశారు. ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు. అదే రేవంత్‌రెడ్డి తన నోటితో గతంలో కడియం శ్రీహరిపై కారుకూతలు కూయడం గమనార్హం. ప్రస్తుతం ఆయన్ను పొగుడుతూ ఉన్న వ్యాఖ్యలను జోడిస్తూ.. గతంలో ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆదివారం అసెంబ్లీలో కడియం శ్రీహరి గురించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆన్‌రికార్డ్‌గా చెబుతున్నా కడియం శ్రీహరి నిజాయితీ, నిబద్ధతను ఈ దేశంలోనే ఎవరూ ప్రశ్నించజాలరని పేర్కొన్నారు. కడియం శ్రీహరి నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవహరించే ప్రజాప్రతినిధి అని కితాబిచ్చారు. ఎన్నో మంత్రి పదవులు చేపట్టినప్పటికీ అవినీతి మరకలేని మంత్రిగా పనిచేశారని కితాబిచ్చారు.
ఇదే రేవంత్‌రెడ్డి గతంలో టీడీపీలో ఉన్న సమయంలో అదే కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘కడియం శ్రీహరి మాల, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాడైతే శాసనసభలో నిజనిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంతూరికి వెళ్లి ప్రజలను కనుక్కుందాం. ఇంతకు ఆయన ఏ కులం వాడు, ఏ సామాజికవర్గం వాడు. ఏ సామాజికవర్గం నుంచి రిజర్వేషన్ అనుభవిస్తున్నాడో తేల్చాలి. నిజనిర్ధారణ కమిటీ ముందు కడియం శ్రీహరి తన శీలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఆయన ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో కడియం శ్రీహరి ప్రజలకు సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నది’ అని నాడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇలా నాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒకలా.. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు మరోలా వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ద్వంద్వ వైఖరిపై సొంత పార్టీ నేతలు సైతం తీవ్రంగా విమర్శిస్తున్నారు.