జనగామ, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తుది విడత పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల అక్రమాలకు పాల్పడిన ఆర్వోలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జనగామ కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు వినతిపత్రం అందజేశారు.
నిబంధనలు అతిక్రమించి అధికార కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ పాలకుర్తి మండలం కోతులబాద్, కొడకండ్ల మండలం నర్సింగపురం, నీలిబండ తండాలో బీఆర్ఎస్ మద్దతుదారుల గెలుపును తారుమారు చేస్తూ ఆర్వోలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కోతులబాద్ గ్రామపంచాయతీలో 5 ఓట్లు, నరసింగాపురం తండా పంచాయతీలో 6 ఓట్లు, గూడూరులో 22 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినట్టు ఆయా పోలింగ్ కేంద్రాల్లోని ఆ ర్వోలు ప్రకటించారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.