హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ప్రవేశాలకు, సీట్ల భర్తీకి ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరంలో 6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు ఎంట్రెన్స్ నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయిలోనా.. జిల్లా స్థాయిలోనా అనేది తేలాల్సి ఉన్నది. జిల్లా స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించడమే ఉత్తమమని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో 495 కేజీబీవీలున్నాయి. 1.55లక్షల విద్యార్థులు చదువుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మాత్రం ప్రవేశ పరీక్ష నిర్వహించి, మెరిట్ ఆధారంగా కేజీబీవీల్లోని సీట్లు భర్తీచేస్తారు. 495 కేజీబీవీల్లో 93 కేజీబీవీలను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ(సీవోఈ)లుగా అప్గ్రేడ్ చేశారు.
ఎప్సెట్, నీట్ వంటి పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్ శిక్షణ ప్రారంభమయ్యింది. ఈ సీవోఈల్లో పాత విద్యార్థులే చదువుతున్నారు. ప్రతిభావంతుల ఎంపిక కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 6వ తరగతి, ఇంటర్మీడియట్ స్థాయిలో రెండు పరీక్షలు నిర్వహించాలన్న దిశగా అడుగులేస్తున్నారు.