అచ్చంపేట, అక్టోబర్ 6 : నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటువర్లపల్లిలో వారం రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గ్రామస్థులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రెండో రోజైన సోమవారం ఖాళీ బిందెలతో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు తాగునీళ్లు లేవని, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పండుగ పూట నీళ్లు లేక గోసపడ్డామని వాపోయారు. సోలార్ సిస్టం వాతావరణం చల్లగా ఉంటే పనిచేయడం లేదని, కరెంట్ ఎప్పుడు పోతదో తెల్వదని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి రాంబాబు అక్కడికి వచ్చి తాగునీటి సమస్య లేకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు రాస్తారోకో విరమించారు.