Rythu Bandhu | హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. ప్రస్తుత పంపిణీ తీరు, సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు గమనిస్తే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రైతుబంధు పంపిణీని గత ప్రభుత్వం డిసెంబర్ 28న మొదలుపెట్టి మార్చి వరకు పంపిణీ చేసేదంటూ సీఎం పలుమార్లు పేర్కొన్నారు. దీనినిబట్టి చూస్తే రైతుబంధు పంపిణీకి తొందరేమీ లేదని, తమకు కూడా మార్చి వరకు సమయం ఉందన్న సంకేతాలు పరోక్షంగా ఇచ్చారు. అందులో భాగంగానే రైతుబంధు పంపిణీ నత్తనడకన సాగుతున్నది. మొత్తం పంపిణీని మార్చి నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది.
ఇవ్వాల్సింది 7600 కోట్లు.. ఇచ్చింది వెయ్యి కోట్లు
యాసంగి రైతుబంధు సాయం కింద సుమారు 70 లక్షల మంది రైతులకు రూ. 7,600 కోట్లు జమ చేయాల్సి ఉంది. డిసెంబర్ 9న రైతుబంధు పంపిణీని సీఎం అట్టహాసంగా ప్రారంభించారు. ఆ తర్వాత 15 రోజుల వరకు మళ్లీ పంపిణీ ఊసులేదు. ఈ నెల రోజుల్లో ప్రభుత్వం ఎకరంన్నర వరకు భూమి గల రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం జమ చేసింది. ఇప్పటి వరకు మొత్తం 30 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం జమ చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా వెల్లడించారు. మొన్నటి వానకాలం లెక్కల ప్రకారం రెండెకరాలున్న రైతులే 40 లక్షల మంది వరకు ఉన్నారు. వీరికి గత సీజన్లో సుమారు రూ. 2వేల కోట్లు పంపిణీ చేశారు.
ఇందులో ఎకరం రైతులు 22.55 లక్షలమంది ఉండగా వీరికి రూ. 642 కోట్లు జమ చేసింది. ఈ లెక్కన చూసుకుంటే ప్రభుత్వం ఇప్పటి వరకు 30 లక్షల మంది రైతులకు రూ. 1000 కోట్ల లోపే పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేసినట్టు లెక్క. గత వానకాలం సీజన్లో కేసీఆర్ ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు రూ. 7,624 కోట్లను పెట్టుబడి సాయం కింద వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ లెక్కన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 40 లక్షల మంది రైతులకు సుమారు రూ. 6,600 కోట్లు పంపిణీ చేయాల్సింది ఉంది.
సంక్రాంతిలోపు పంపిణీ చేసిన కేసీఆర్ సర్కారు
రైతుబంధు సాయాన్ని గత ప్రభుత్వం డిసెంబర్ 28న మొదలుపెట్టి మార్చి నెల వరకు పంపిణీ చేసిందంటూ సీఎం రేవంత్ పలుమార్లు వ్యాఖ్యానించారు. వాస్తవం మాత్రం అదికాదు. యాసంగి సీజన్‌కు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం సకాలంలోనే పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించింది. డిసెంబర్ 28న ప్రారంభించి సంక్రాంతి నాటికి అర్హులైన రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయాన్ని జమ చేసింది. కొంత ఆలస్యమైనా జనవరి చివరినాటికి పంపిణీ పూర్తి చేసేది. కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ సకాలంలో రైతుబంధు పంపిణీ చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది. ప్రస్తుత ప్రభుత్వం డిసెంబర్ 9న పంపిణీ ప్రారంభిస్తే నెల రోజులు గడిచినా రెండెకరాల రైతులకు రైతుబంధు జమ కాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.