వంగూరు, ఏప్రిల్ 11 : పాలమూరు రైతులకు నష్టం కలిగించే డిండి ఎత్తిపోతలను వెంటనే రద్దు చేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లా జేఏసీ నాయకులు రాజేందర్‌రెడ్డి, రాఘవాచారి డిమాండ్ చేశారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఉల్పర నుంచి డిండిచింతపల్లి వరకు డీఎల్ఐ కాలువను ఉమ్మడి జిల్లా జేఏసీ నాయకులు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. భూములు కోల్పోయేది పాలమూరు రైతులు, నీళ్లు పారేది నల్లగొండకు అయితే ఇక్కడి పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
పర్యావరణ అనుమతులు, డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు ఎలా చేపడుతారని మండిపడ్డారు. ఈ ప్రాంతానికి నష్టం కలిగేలా నల్లగొండకు చెందిన ఇంజినీర్లు కుట్రలు చేశారని ఆరోపించారు. కల్వకుర్తి ఎత్తిపోతల కింద సాగుకు అనుకూలమైన భూములు సర్కార్ డిండి ఎత్తిపోతలకు తీసుకొని రైతులను నిండా ముంచిందని విమర్శించారు.
ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తే సీఎం అయి ఉండి పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. డీఎల్ఐని రద్దు చేయడంతోపాటు ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉల్పర సర్పంచ్ కృష్ణయ్య, వీరబ్రహ్మాచారి, న్యాయవాదులు మధుసూదన్, పరమేశ్వర్‌గౌడ్, వెంకట్‌గౌడ్, తిమ్మప్ప, వెంకటేశ్వర్లు, ఖలీల్, రిటైర్డు తహసీల్దార్ చెన్నకిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.