Congress Govt | హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఏడాది కావొస్తున్నది. అద్భుతమైన పాలన అందించామంటూ సీఎం రేవంత్రెడ్డి సంబురాలకు సిద్ధమవుతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి గల్లీ లీడర్ల వరకు కాంగ్రెస్కు శ్రేణులంతా ఏడాది పాలనపై విజయోత్సవాలకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లకపోగా మరింత అధ్వానస్థితికి చేరింది. ఆడంబరాలతో కాలయాపన చేస్తూ అభివృద్ధిపై దృష్టి పెట్టని సీఎం రేవంత్రెడ్డి అప్పుల కుప్ప పోస్తూ రాష్ట్ర ఆస్తుల పెంపును నిర్లక్ష్యం చేస్తున్నారు. రాబడి పెంపుపై కనీస ప్రణాళికలు ఆచరణకు నోచుకోవడం లేదు.
ఏ పట్నం చూసినా ఏమున్నది!
రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేదు. ఎక్కడ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా మారింది.. పరిస్థితి. అభివృద్ధి జాడ లేదు, సంక్షేమం సంగతే సర్కారుకు యాదికి లేదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దూరదృష్టితో ప్రణాళికలు రచించడం సంగతి పక్కన పెడితే కనీస అవసరాలకు సంబంధించిన అభివృద్ధి పనులు కూడా జరగడం లేదు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి కుంటుపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని 143 పట్టణాల ప్రగతిని గాలికొదిలేసింది. జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పోరేషన్లు, ఇతర మున్సిపాలిటీలలో అభివృద్ధి మచ్చుకు కూడా కనిపించడం లేదు. మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్దే తప్ప.. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకోదగిన పనులేమీ చేయలేదు. పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. అధికారులు సమావేశాలు, సమీక్షలతో కాలయాపన చేస్తున్నారు.
జడుసుకుంటున్న కాంట్రాక్టర్లు
జీహెచ్ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో అభివృద్ధి కోసం అధికారు లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుం చి స్పందన కరవైంది. పాత బిల్లుల సంగతి తేల్చితేనే కొత్తగా పనులు చేపట్టడంపై ఆలోచిస్తామని తేల్చిచెబుతున్నారు.కనీసం టెండర్లు కూడా వేయ డం లేదంటే వారు ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. బిల్లుల కోసం పాత కాంట్రాక్టర్లు పడుతున్న తిప్పలు చూస్తున్న కొత్త కాంట్రాక్టర్లు పారిపోతున్నారు. గ్రామాల్లో పరిస్థితి కూడా పట్టణాల్లో లాగానే ఉంది. అక్క డ కూడా పనులు ముందుకు సాగడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలు, పట్టణాలపై ఇదే నిర్లక్ష్యం కొనసాగిస్తే ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికావడం తప్పదని పౌరసంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.