గార్ల, డిసెంబర్ 20: కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్లలో సోమవారం నిర్వహించిన సీపీఎం జిల్లా ద్వితీయ మహాసభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి, రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడిందన్నారు. నిరసన కార్యక్రమాల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను కేంద్రమే ఆదుకోవాలని కోరారు. ప్రధాని మోదీ నిరంకుశ పాలన చేస్తున్నారని ఆరోపించారు. నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అంటగట్టేందుకు పన్నాగాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.