హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్ అడ్మిషన్లలో జీవో 33కి సంబంధించి వైద్యారోగ్యశాఖ వివరణ ఇచ్చింది. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేండ్లు చదివిన ప్రాంతాన్ని లోకల్‌గా నిర్ధారించే వెసులుబాటుకు కాలపరిమితి ముగిసినట్టు పేర్కొన్నది. 2017లో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని గుర్తు చేసింది. రాష్ట్రంలో 15 శాతం ఉమ్మడి కోటా కింద ఉండేదని, ఏపీ, తెలంగాణ విద్యార్థులు మెరిట్ ప్రకారం ఈ సీట్లు పొందేవారని పేర్కొన్నది.
స్థానికత నిర్ధారణకు 2 రకాల నిబంధనలు ఉండేవని వెల్లడించింది. మొదటి ఆప్షన్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేండ్లు చదివిన ప్రాంతాన్ని లోకల్‌గా, రెండో ఆప్షన్లో ఆరో తరగతి నుం చి ఇంటర్ వరకు ఏడేండ్లలో వరుసగా నాలుగేండ్లు చదివిన ప్రాంతాన్ని లోకల్‌గా నిర్ధారించారని పేర్కొన్నది. ఈ ఏడాది జూన్ 2తో ఉమ్మడి కోటా రద్దయినప్పుడే స్థానికత రెండో వెసులుబాటు కూడా రద్దయిందని వెల్లడించింది.