హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 13 జిల్లాలకు వైద్యారోగ్య శాఖ ఇన్చార్జి డీఎంహెచ్వోలను నియమించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నియామకాలపై వైద్యవర్గాల నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైరవీలు చేసుకున్నవారికే పోస్టింగ్లు ఇచ్చారని, భారీ మొత్తంలో చేతులు మారాయని వైద్యులు, వైద్య సంఘాల్లో చర్చ జరుగుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారాజ్యంగా నియామకాలు జరిగినట్టు చెబుతున్నారు. ఇందుకు మహబూబ్నగర్ జిల్లాను ఉదాహరణగా చూపుతున్నారు. మహబూబ్నగర్ రెగ్యులర్ డీఎంహెచ్వోగా డాక్టర్ పద్మ విధులు నిర్వహిస్తున్నారు. ఆమె కొనసాగుతుండగానే.. ఇంచార్జి డీఎంహెచ్వోగా డాక్టర్ కే కృష్ణను మంగళవారం నియమించారు.
రెగ్యులర్ డీఎంహెచ్వోను బదిలీ చేయకుండానే, పోస్టును ఎలా వేకెన్సీగా చూపారని, ఎలా ఇంచార్జి డీఎంహెచ్వోను నియమించారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై మంగళవారం రాత్రి మహబూబ్నగర్ డీఎంహెచ్వో కార్యాలయంలో సంప్రదించగా.. ఇంచార్జి డీఎంహెచ్వో నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చాయని, కానీ డాక్టర్ పద్మకు సంబంధించి బదిలీ ఉత్తర్వులేమీ రాలేదని తెలిపాయి. మిగతా జిల్లాల పోస్టింగ్పైనా వైద్యసంఘాలు భగ్గుమంటున్నాయి.
వర్టికల్ పద్ధతిలో సీనియార్టీ ప్రకారమే ఈ పోస్టులు భర్తీచేయాలని, ఏడీపీహెచ్వోలకు డీఎంహెచ్వో బాధ్యతలు ఇవ్వొద్దని తాము ఎన్నాళ్లుగానో పోరాడుతున్నామని తెలిపాయి. కొన్నాళ్లుగా డీఎంహెచ్వోల నియామకాలు ఆగడానికి కూడా కారణం ఇదేనని పేర్కొన్నాయి. మరోవైపు ప్రస్తుతం సివిల్ సర్జన్లకు పదోన్నతులపై డీపీసీ పెండింగ్లో ఉన్నదని గుర్తు చేస్తున్నాయి. డీపీసీ పూర్తిచేసి, పదోన్నతులు ఇచ్చిన తర్వాత డీఎంహెచ్వో పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, ఆగమేఘాల మీద ఎందుకు నియామకాలు జరిపారన్న చర్చ జరుగుతున్నది. పైరవీలు, భారీ మొత్తంలో చేతులు మారటంతోనే ఇలా అడ్డగోలుగా నియామకాలు జరిపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.