హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ పరిధిలోని 8 ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని ఆ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా ముదిరాజ్, యాదవ కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక (పురగిరి క్షత్రియ), లింగాయత్, మేర, గంగపుత్ర కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, సగర (ఉప్పర) వాల్మికి బోయ, కృష్ణబలిజ, భట్రాజు, కుమ్మరి ఫెడరేషన్లను కో-ఆపరేటివ్ కార్పొరేషన్లుగా మార్చాలని తాజాగా నిర్ణయించారు. ఒక్కో కార్పొరేషన్‌కు ఎండీ, ఫైనాన్స్ మేనేజర్, ముగ్గురు సూపరింటెండెంట్లు, ఆరుగురు సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు కలిపి 38 మంది చొప్పున సిబ్బంది అవసరమవుతారని ప్రభుత్వానికి బీసీ సంక్షేమశాఖ ప్రతిపాదనలు పంపినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కానీ, ఇప్పటికే ఉన్న ఫెడరేషన్లకే పూర్తిస్థాయిలో ఎండీలు లేరు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఏడీలు, జేడీలే ఒక్కొక్కరు అదనంగా రెండేసి ఫెడరేషన్ల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.