హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నిర్వహించిన కాన్వాయ్ ట్రయల్ రన్లో వాహనం ఢీకొట్టి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడు సమీపంలో ఆదివారం సీఎం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించే క్రమంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం బైక్‌పై వస్తున్న అంకన్నను (25) ఢీకొట్టింది. దీంతో అంకన్న అక్కడికక్కడే మృతిచెందాడు. దోర్నాల పోలీసులు మృతదేహాన్ని మార్కాపురం దవాఖానకు తరలించారు.
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): విశాఖలోని సెలబ్రేషన్స్ రెస్టారెంట్లపై ఐటీ అధికారులు ఆదివారం ఏకకాలంలో నాలుగు చోట్ల దాడులు చేశారు. పెందుర్తితోపాటు అక్షయపాలెం, మధురవాడలోని బ్రాంచీల్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో రెస్టారెంట్లల్లో జోరుగా అమ్మకాలు జరుపుతున్న నిర్వాహకులు, రికార్డులను తొలగించినట్టు తెలుసుకున్నారు. కస్టమర్లు ఆన్లైన్ పేమెంట్ల ద్వారా చెల్లించిన డబ్బులతోపాటు నేరుగా చెల్లించిన నగదు చెల్లింపుల్లో లోపాలున్నట్టు గుర్తించారు. జీఎస్టీ, ఐటీ పన్ను సైతం ఎగవేసినట్టు ఆధారాలు సేకరించారు. ఈ సందర్భంగా కంప్యూటర్ డాటాతో పాటు పలు రికార్డులను తనిఖీలు చేశారు.