హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): సొంత క్యాడర్లో రిపోర్ట్ చేయాలన్న కేంద్ర అంతర్గత శిక్షణ, వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలను సవాలు చేస్తూ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ఏపీ, తెలంగాణకు చెందిన మొత్తం 11 మంది ఐఏఎస్‌లు క్యాడర్ మార్చాలం టూ చేసుకున్న దరఖాస్తును ఇటీవల డీవోపీటీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. వెంటనే ఏపీ, తెలంగాణ నుంచి రిలీవ్ కావాలని, 16వ తేదీలోగా సొంత క్యాడర్లో చేరాలని డీవోపీటీ ఆదేశించింది.
ఆదేశాలు అందుకున్నవారిలో తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్‌లు వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి కాట, వాణీప్రసాద్, ప్రశాంతి, ఐపీఎస్‌లు అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి ఉన్నా రు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ క్యాడ ర్ ఐఏఎస్‌లు హరికిరణ్, శ్రీజన, శివశంకర్ ఉన్నారు. అయితే వీరు ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ర్టాలను విడిచి వెళ్లేందుకు సిద్ధంగా లేమని చెప్తున్నారు. మరోవైపు డీవోపీటీ ఆదేశించిన ఇరు రాష్ర్టాల సీఎస్‌లు వారిని రిలీవ్ చేయలేదు.
ఏపీ క్యాడర్ ఐఏఎస్‌లు వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, అమ్రపాలి తదితరులు సోమవారం సచివాయలంలో సీఎస్ శాంతికుమారితో భేటీ అయ్యారు. డీవోపీటీ ఆదేశాలపై చర్చించారు. అనంతరం తెలంగాణ నుంచి ఐఏఎస్‌లు రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ఆమ్రపాలి, ఏపీ నుంచి శ్రీజన కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించా రు. డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ నలుగురు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తాము ప్రస్తుతం పనిచేస్తున్న క్యాడర్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కోరారు.
ఈ పిటిషన్లపై మంగళవారం క్యాట్ విచారణ చేపట్టనున్నది. డీవోపీటీ విధించిన గడువు బుధవారంతో ముగుస్తుండటంతో క్యాట్ ఆదేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఒకవేళ వారికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు వస్తే, మిగతా ఐఏఎస్‌లు కూడా క్యాట్‌ను ఆశ్రయించాలని భావిస్తున్నారట. ఒకవేళ క్యాట్ ఈ పిటిషన్లను తిరస్కరిస్తే బుధవారం 11 మంది ఐఏఎస్‌లు రిలీవ్ కావాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు.