Congress | హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో మళ్లీ పీసీసీ అధ్యక్ష పదవిపై కాంగ్రెస్‌లో చర్చ మొదలైంది. రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి సారథిని ఎంపిక చేసేందుకు పార్టీ అధిష్ఠానం సుదీర్ఘ కసరత్తు చేస్తున్నది. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక దాదాపు పూర్తయిందనుకుంటున్న సమయంలో అధిష్ఠానం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆ సమయంలో మహేశ్‌కుమార్‌గౌడ్ పేరు ఖరారైనట్టు ప్రచారం జరిగింది. ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేకు ధన్యవాదాలు తెలుపుతున్న ఫొటోలు కూడా విడుదలయ్యాయి. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ప్రధానంగా చర్చ ఉంటుందని ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎవరికి పీసీసీ పదవిని అప్పగిస్తారన్న దానిపై తీవ్రమైన చర్చ జరుగుతున్నది. మహేశ్‌కుమార్‌గౌడ్ తనకు దాదాపు పదవి ఖాయమైందన్న ధీమాతో ఉండగా.. తాజాగా తెరమీదకు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు వచ్చింది. ఆయన తనకు పార్టీలో తగిన గుర్తింపు ఇస్తారని, పీసీసీ అధ్యక్ష పదవి తనదేనని చెప్తున్నారు.
ఈ విషయంలో నిర్ణయం జరిగిపోయిందని, పార్టీ అధిష్టానం ప్రకటన చేయడమే ఆలస్యమని అంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడ తెగకు చెందిన వారికి మంత్రి పదవి దక్కలేదని, వారికి సముచిత స్థానం ఇవ్వకపోతే పార్టీ మనుగడకు ఇబ్బంది అన్న విషయాన్ని అధిష్ఠానం గుర్తించిందని ఆయన తన సన్నిహితులతో చెప్తున్నారు. ఇక మరోనేత, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పార్టీలో మాదిగ సామాజికవర్గానికి చెందిన లక్ష్మణ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే మంచిదని, ఎస్సీల వర్గీకరణ రాష్ట్రంలో ప్రధానాంశంగా ఉండటంతో లక్ష్మణ్ వంటి సీనియర్లకు పీసీసీ పదవి ఇస్తే బాగుంటుందన్న ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తున్నది. పలువురు మంత్రులు కూ డా ఆయన పేరును సిఫారసు చేస్తున్నట్టు సమాచారం. ఇక మరో నేత మధుయాష్కీ కూడా రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. బీసీ సామాజికవర్గానికి చెందిన తనకు ఖచ్చితంగా పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని ఆయన తన అనుచరులతో చెప్తున్నట్టు తెల్సింది.
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావును పక్కకు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ అధిష్టానానికి సిఫారసు చేశారు. ఆమె స్థానంలో గద్వాలకు చెందిన సరిత పేరును సీఎం సిఫారసు చేశారు. ఈ మేరకు సీఎం పేరుతో ఒక లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. గద్వాలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై సరిత వర్గం భగ్గుమన్న సంగతి తెల్సిందే. దీంతో తాను తిరిగి బీఆర్ఎస్లోకే వెళ్తానని కృష్ణమోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కల్పించుకొని కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌లో ఉండేలా ఒప్పించారు. అదే సమయంలో సరితకు పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ప్రస్తుత మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆమె తనకు పార్టీ సరైన గుర్తింపు ఇవ్వడంలేదని మీడియాతో వాపోయారు. తన పదవిని కాపాడుకునేందుకు ఆమె తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు. ఇవి కాకుండా రేవంత్ తన పర్యటనలో నామినేటెడ్ పోస్టులకు కూడా 20 మందిని ఎంపిక చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలిసింది.
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ ఢిల్లీ వెళ్లడం ఇది 19వ సారి. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్ష పదవితోపాటు పార్టీలోని ఇతర పదవులపైనా అధిష్ఠానం పెద్దలతో సీఎం చర్చించనున్నట్టు సమాచారం. పీసీసీ చీఫ్ పదవిపై అధిష్ఠానం దాదాపు మూడు నెలలుగా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్‌కుమార్‌గౌడ్ పేరు దాదాపు ఖరారైందని అప్పట్లో వార్తలు రాగా, తాజాగా మరో రెండుమూడు పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ విభాగాలకు అధ్యక్షుల నియామకం, మంత్రి పదవుల విస్తరణ వంటి అంశాలపైనా చర్చించనున్నట్టు సమాచారం. దీంతోపాటు ఢిల్లీలో ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతోనూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చర్చించనున్నట్టు తెలిసింది.