Tigers | హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో వరుసగా పులులు మృతి చెందడం అధికారులను కలవరపెడుతున్నది. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా 200కుపైగా పులులు మృతి చెందినట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, గత రెండున్నర నెలల్లో మహారాష్ట్ర, తెలంగాణలోనే 13 పులులు మృత్యువాత పడటంతో రెండు రాష్ర్టాల అటవీశాఖ అధికారులు ఆందోళన చెందతున్నారు. వాస్తవానికి మహారాష్ట్ర, తెలంగాణ అడవుల్లో పులుల సంతతి పెరిగింది. దీంతో వాటిపై ఒత్తిడి పెరిగి స్థావరాల ఏర్పాటు కోసం సమీప గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. పంట పొలాల్లో సంచరిస్తూ మనుషులు, పశువులపై తరచూ దాడులకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని చంపేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల విషప్రయోగానికి గురైన ఓ పశువును తిని రెండు పులులు మరణించడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటివరకు స్థానికుల సహకారంతో అడవులను, వన్యప్రాణులను రక్షించే వాళ్లమని, ఇప్పుడు ప్రజలే వణ్యప్రాణులను చంపుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని అటవీశాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు.
వన్యప్రాణుల సంరక్షణపై మహారాష్ట్ర, తెలంగాణ అటవీ అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా పులులు, ఇతర క్రూర మృగాల ఉనికిని తెలుసుకుని సంబంధిత సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు తొలుత ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించి, కార్యాచరణ రూపొందించాలన్న అభిప్రాయానికి వచ్చారు. తడోబా, కవ్వాల్ టైగర్ రిజర్వుల పరిధిలో పులుల కదలికలను పర్యవేక్షించేందుకు ఆధునిక సాంకేతికతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు వన్యప్రాణుల సంరక్షణపై అటవీ గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
జాతీయ గణాంకాల ప్రకారం 2022 నాటికి దేశంలో 3,167 పులులు ఉన్నాయి. వీటిలో 204 పులులు నిరుడు జనవరి 1 నుంచి డిసెంబర్ 25 మధ్య కాలంలో మృతి చెందినట్టు వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా (డబ్ల్యుపీఎస్ఐ) వెల్లడించింది. మహారాష్ట్రలో 52, మధ్యప్రదేశ్‌లో 45 , ఉత్తరాఖండ్‌లో 26, తమిళనాడులో 15, కేరళలో 15, కర్ణాటకలో 13, అస్సాంలో 10, రాజస్థాన్‌లో 10, ఉత్తరప్రదేశ్‌లో 7, బీహార్‌లో 3, ఛత్తీస్‌గఢ్‌లో 3, ఒడిశాలో 2, ఏపీలో 2, తెలంగాణలో ఒకటి చనిపోయినట్టు వివరించింది. వీటిలో 79 పులులు వేటగాళ్లు వల్ల, 46 పులులు అంతర్గత ఘర్షణల వల్ల, 7 పులులు ప్రమాదాల వల్ల, 2 పులులు ఇతర జంతువుల దాడుల వల్ల, ఒక పులి స్థానికుల దాడిలో మృతిచెందినట్టు వివరించింది.