హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆఖరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల దాఖలుకు గడువు మగియగా.. అప్పటికే క్యూలైన్లలో ఉన్నవారు నామినేషన్లు వేసేందుకు అనుమతించారు. శనివారం అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.
నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు విధించారు. కాగా ఫిబ్రవరి 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. మొత్తం 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 13న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫిర్యాదులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ‘టీఈ పోల్’ మొబైల్ యాప్ ఏర్పాటు చేసింది. tsec.gov.in ద్వారా కూడా ఫిర్యాదులకు అవకాశం కల్పించినట్టు ఎస్ఈసీ తెలిపింది.