హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేసే పాడి పరిశ్రమ తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నది. గతంతో పోలిస్తే పశువుల దాణా, మేత, వైద్యం తదితర ఖర్చులు భారీగా పెరగడంతో ఒక్కో పశువు పోషణకు రోజూ దాదాపు రూ.250 వరకు వెచ్చించాల్సి వస్తున్నది. కానీ, పాల దిగుబడి, అమ్మకం ధరలు మాత్రం గణనీయంగా తగ్గిపోతున్నాయి. దీంతో చాలా మంది రైతులు పాడి పరిశ్రమను వదిలి, ఇతర ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు.
పాడి బర్రెలతో పోలిస్తే ఆవుల పోషణ మరింత భారంగా మారుతున్నదని, ఆవు పాలకు గిరాకీతోపాటు ధర తక్కువగా ఉంటున్నదని రైతులు వాపోతున్నారు. గతంలో లీటర్ పాల ధర రూ.35 నుంచి రూ.45 వరకు పలికేది. ఇటీవల తెలంగాణ విజయ డెయిరీ పాల ధరను రూ.25కు తగ్గించింది. దీంతో పాడి పరిశ్రమపై ఆధారపడే రైతుల సంఖ్య క్రమంగా తగ్గి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్నది.
పాడి రైతులు ప్రధానంగా పశుగ్రాసం సమస్యను ఎదుర్కొంటున్నారు. కొన్నేండ్లుగా గ్రామాల్లో బీడు భూములు, పంట పొలాలన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతుండటంతో గడ్డి మైదానాలు తగ్గి పశువులకు మేత లేదు. దీంతో చాలా మంది రైతులు పశువుల పెంపకాన్ని తగ్గిస్తున్నట్టు ఇటీవల సర్వేలో తేలింది.
గ్రామీణ ప్రజల జీవన విధానం మారడంతోపాటు పిల్లల విద్య, ఉద్యోగ అవసరాల రీత్యా పట్టణాలకు వలస వెళ్లడం రాష్ట్రంలో పాడి పశువుల సంఖ్య తగ్గడానికి మరో ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. దీంతో గ్రామీణ ప్రజలు సైతం పట్టణాల నుంచి వచ్చే ప్యాకెట్ పాల కోసం ఎదురుచూస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలంటే పాడిపరిశ్రమపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరమున్నదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.