హైదరాబాద్/రంగారెడ్డి/మహబూబ్‌నగర్/మాగనూరు, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): అవినీతి నిరోధకశాఖ వలకు రూ.100 కోట్లు కూడబెట్టిన అవినీతి అధికారి తిమింగలం చిక్కింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన అధికారి గుట్టును ఏసీబీ రట్టు చేసింది. రంగారెడ్డి జిల్లా సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కే శ్రీనివాసులుపై నిఘా పెట్టిన అధికారులు గురువారం ఆయన కార్యాలయం, ఇంటితోపాటు, బంధువులు, స్నేహితులు, బినామీల ఇండ్లు సహా 7 చోట్ల ఏకకాలంలో పది గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలోనూ సోదాలు చేపట్టారు. తనిఖీల్లో సేకరించిన సమాచారం ప్రకారం శ్రీనివాసులు అక్రమాస్తుల మార్కెట్ విలువ సుమారు రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనాకు వచ్చారు.
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు కార్యాలయంలో ఏసీబీ అధికారులు పదిగంటలు సోదాలు చేశారు. ఫిర్యాదులు అందిన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం ఆరుగంటలకు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన ఏసీబీ అధికారులు సాయంత్రం 6 గంటల వరకు దర్యాప్తు జరిపారు. ఏడీ శ్రీనివాసులు అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో విలువైన భూముల రికార్డులను తారుమారు చేసి కోట్ల రూపాయలు కూడబెట్టినట్టు ఆరోపణలొస్తున్నాయి. ముఖ్యంగా మణికొండ, నార్సింగి, వట్టినాగులపల్లితోపాటు శివారు ప్రాంతాల్లోని భూవివాదాల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో శ్రీనివాసులు చేసిన అవినీతి అక్రమాలు గుట్టలుగుట్టలుగా బయటకొస్తున్నాయి. హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలు, మండలాల్లో విలువైన భూముల రికార్డులు తారుమారు చేసినట్టు అభియోగాలున్నాయి. పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంతోపాటు రాయదుర్గంలోని మైహోమ్ భుజలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. శ్రీనివాసులు గతంలో నల్లగొండ జిల్లాలో పని చేస్తున్నప్పుడు అతడిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆయనను శిక్షించాల్సిన అధికారులు రంగారెడ్డి జిల్లా ఏడీగా కీలక స్థానానికి బదిలీ చేశారు. రంగారెడ్డి జిల్లాకు వచ్చిన తర్వాత శ్రీనివాసులు మరింత రెచ్చిపోయారు. పనిచేసిన ప్రతిచోట భారీగా కూడబెట్టినట్టు ఆరోపణలున్నాయి. గతంలోనే ఆయనపై హైదరాబాద్ కమిషనర్రేట్ పరిధిలో కేసు కూడా నమోదైనట్టు తెలిసింది.
నారాయణపేట జిల్లా కృష్ణ మండలం హిందూపూర్ గ్రామ శివారులోని వసుధ రైస్ మిల్లులోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ నేతృత్వంలోని బృందం తనిఖీలు చేపట్టింది. హిందూపూర్ శివారులోని రైస్ మిల్లు కోసం సుమారు రూ.60 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. మహబూబ్‌నగర్‌లోని నాలుగు ప్లాట్లు, నారాయణపేట జిల్లాలో మూడు ప్లాట్లకు సంబంధించిన పత్రాలు లభ్యమైనట్టు డీఎస్పీ తెలిపారు. శ్రీనివాసులు సోదరుల వద్ద రూ.5 లక్షల నగదు, 1.6 కేజీల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి, కియా, ఇన్నోవా కార్లు గుర్తించినట్టు చెప్పారు. శ్రీనివాసులపై కేసు నమోదు చేశారు. మరిన్ని ఆస్తుల గుర్తింపు కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
1) హైదరాబాద్‌లోని మై హోమ్ భుజలో ఫ్లాట్ (హెచ్-1 901)
2) నారాయణపేట జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్/ రైస్‌మిల్లు
3) కర్నాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి
4) ఏపీలోని అనంతపురంలో 11 ఎకరాల వ్యవసాయ భూమి
5) మహబూబ్‌నగర్ జిల్లాలో 4 ఇండ్ల స్థలాలు
6) నారాయణపేట జిల్లాలో 3 ఇండ్ల స్థలాలు
7) రూ.5 లక్షల నగదు
8) 1.6 కేజీల బంగారం, 770 గ్రాముల వెండి
9) ఒక కియా సెల్టోస్ హైక్లాస్ కారు
10) ఒక టయోటా ఇన్నోవా కారు