యాదాద్రి, అక్టోబర్ 6: యాదగిరీశుడి విమాన గోపురం స్వర్ణతాడపం పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్వర్ణతాపడానికి ముందు చేపట్టిన రాగి తొడుగుల పనులు నెల రోజుల్లో పూర్తికానున్నాయి. ఇందుకుకోసం దేవస్థానం రూ.7 కోట్లు వెచ్చించి 1,100 కిలోల రాగిని వినియోగిస్తున్నారు. తమిళనాడులోని మహాబలిపురానికి చెందిన రవీంద్రన్ స్థపతి ఆధ్వర్యంలో 100 మంది ఉప స్థపతులు పనుల్లో నిమగ్నమయ్యారు. లక్క, తుమ్మబంక, సామ్రాణి మెటీరియల్, నూనె, వ్యాక్స్లను కరిగించి విమానగోపురంపై ఉన్న ఆకృతులను తీర్చిదిద్దుతున్నారు.
గర్భాలయ విమాన గోపురంలో ఎటుచూసినా దిగ్దేవతలు, దేవతామూర్తులే దర్శనమివ్వనున్నారు. తూర్పు ముఖంగా ఇంద్రుడు, పడమర వరుణుడు, ఉత్తర దిక్కున కుబేరుడు, దక్షిణాన యముడు, ఆగ్నేయంలో అగ్ని, నైరుతిలో నిరుతి, వాయవ్యంలో వాయుదేవుడు, ఈశాన్యంలో శివుడు ఉంటారు. తూర్పున నరసింహస్వామి, పడమర బ్రహ్మదేవుడు, దక్షిణంలో శివుడు, ఉత్తరంలో వరాహమూర్తి, విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి. ఈ ప్రతి రూపాన్ని పూర్తిగా స్వర్ణమయం చేయాలని సీఎం కేసీఆర్ నిశ్చయించారు. భక్తులందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో తోచినంత విరాళం అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో విరాళాలు వెల్లువలా వస్తున్నాయి.
గత నెల 30న సీఎం కేసీఆర్ దంపతులు యాదగిరీశుడిని దర్శించుకొని 1.16 కిలోల బంగారానికి సంబంధించిన రూ. 52,48,097 చెక్కు అందజేశారు. 2021 సెప్టెంబర్ 25 నుంచి ఇప్పటివరకు స్వామివారి స్వర్ణతాపడానికి రూ.23,99,72,230 నగదు, 7.877 కిలోల బంగారం స్వామివారి ఖాతాలో జమైనట్టు ఆలయ ఈవో ఎన్ గీత వెల్లడించారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి దివ్య విమాన గోపురం స్వర్ణతాపడానికి 125 కిలోల బంగారాన్ని వినియోగించనున్నారు. ఇందుకోసం సుమారు రూ.65 కోట్లు సేకరించాల్సి ఉన్నది.