హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రవాణా శాఖలో ఓ కానిస్టేబుల్ చెప్పిందే వేదం.. ఆయన ఆడింది ఆట.. రవాణా శాఖలోని ఐఏఎస్ అధికారి పోస్టింగ్ అయినా.. కింది స్థాయి సిబ్బంది పోస్టింగ్ అయినా ఆయన చెప్పినట్టే జరుగుతుంది. రూ.పది లక్షల కాంట్రాక్ట్ పనైనా, రూ.వందల కోట్ల కాంట్రాక్ట్ పనైనా ఆయన చెప్పిందే ఫైనల్. ఇప్పుడు చేపట్టిన సాధారణ బదిలీలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఈ శాఖలో ఏం చేయాలన్నా ఆయన ఆజ్ఞాపించాల్సిందే. ఆయన ఆజ్ఞ లేకుండా ఈ శాఖలో చీమ కూడా కుట్టదనడంలో సందేహంలేదు. గడిచిన రెండున్నరేండ్లుగా ఆ శాఖలో నిర్ణయాధికారమంతా ఆయన గుప్పిట్లోనే ఉన్నదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
కానిస్టేబుల్ ర్యాంక్‌లో ఉన్న ఆయన ప్రస్తుతం డిప్యుటేషన్‌పై రాష్ట్ర ముఖ్యనేత వద్ద ఉంటున్నాడు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది మొదలు.. ఆ కానిస్టేబుల్‌కు పట్టపగ్గాలు లేవు. ప్రభుత్వం మారిన వెంటనే తన వారిని తెచ్చి ఫోకల్ పాయింట్లలో పెట్టుకొనేందుకు ప్రయత్నించారు. దీని కోసం గతంలో బాగా పనిచేసి ఎలాంటి ఆరోపణలు లేనివారిని కూడా పనీపాటలేని చోటుకు బదిలీ చేశారు. బదిలీల ప్రక్రియను పెద్ద ప్రహసనంలా నడిపించారు. రవాణా శాఖలో కమిషనర్లు, కార్యదర్శులను ఇష్టానుసారం మార్చేశారు. గడిచిన మూడేండ్లలో నలుగురు కమిషనర్లు మారారు. రఘునంద రావు, జ్యోతిబుద్దప్రకాశ్, సురేంద్రమోహన్, ఇలంబర్తి కమిషనర్లుగా వ్యవహరించారు.
ప్రస్తుతం ఇలంబర్తి కొనసాగుతున్నారు. కమిషనర్ల స్థానంలో ఎవరు వచ్చినా ఒత్తిళ్లలోనే పనిచేయాల్సి ఉంటుందని రవాణా శాఖ వర్గాలు చెప్తున్నాయి. కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, రవాణా శాఖ అధికారులు, మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు.. ఇలా ఒకటేమిటి..? అన్నింట్లోనూ ఆయనే తలదూరుస్తున్నారని చెప్తున్నారు. మంత్రి ఒకరి పేరు చెప్తే.. కానిస్టేబుల్ మరొకరిని సిఫార్సు చేయించారు. రాష్ట్రంలో ఏ శాఖలో లేనివిధంగా ఈ శాఖలో ఇప్పటివరకు కనీసం నలుగురు కమిషనర్లు మారారు. ఇక డిప్యుటేషన్లకు లెక్కే లేదు. తనకు అనుకూలమైన వారు ఎవరుంటే వారిని ఇష్టమున్న చోటకు డిప్యుటేషన్‌పై రప్పించుకొంటున్నారు. తాత్కాలికంగా వర్క్ ఆర్డర్ ఇచ్చి హైదరాబాద్‌లోని ఫోకల్ పాయింట్లలో పనిలో పెట్టుకొంటున్నారు.
ఇక శాఖలో తన మాట చెల్లుబాటు కాకపోతే పగబట్టి ఏసీబీతో దాడులు చేయిస్తున్నది కూడా ముఖ్యనేత అనుచరుడైన కానిస్టేబులే అని చెప్తున్నారు. గతంలో చెక్పోస్టులపై, ఒకరిద్దరు అధికారులపై పనిగట్టుకొని ఏసీబీ దాడులు చేయించాడని, డిపార్ట్మెంట్లో ఏసీబీ దాడులు చేయించి లొంగదీసుకోవడం పరిపాటిగా మారిందని, మాట వినకపోతే.. ఎక్కడైనా ఆయన గురించి చెప్పినా తమను లక్ష్యంగా చేసుకొంటున్నారని, రవాణా శాఖలో ఒక ముఠాను తయారు చేశారని, ఇప్పుడు ఆ ముఠా ఆడింది ఆటగా మారిందని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యనేతకు దగ్గరగా ఉండటంతో ఈ కానిస్టేబుల్‌కు వ్యతిరేంగా మాట్లాడేందుకు, ఫిర్యాదులు చేసేందుకు ఏ అధికారి కూడా సాహసించడంలేదు.
ఇటీవల ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ (ఏటీఎస్)ను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలనుకున్నారు. దీనికి సంబంధించిన పనుల విలువలు అమాంతంగా ఎందుకు పెరిగాయో కనీసం ఆ శాఖ మంత్రికి కూడా తెలియదు. ఏటీఎస్‌ల పేరుతో భారీ దోపిడీకి ప్రణాళిక వేశారని, దీనిపై స్పందించాలంటూ పలువురు రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు రవాణా శాఖలో జరుగుతున్న బదిలీల వెనుక కూడా ఈ కానిస్టేబుల్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్తున్నారు.
తనకు నమ్మిన బంటుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎఎంవీఐని డిప్యుటేషన్‌పై ఎస్‌టీఏలో నియమించుకున్నాడు. ఈయనకు ఇక్కడ మరో కీలకమైన సంయు క్త అధికారి కూడా తోడయ్యాడు. సంయుక్త అధికారి, ఎఎంవీఐలు ప్రతీ ఫైలును డిసైడ్ చేస్తున్నారు. వీరితోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన మరో అధికారి ఎప్పుడు చూసినా హైదరాబాద్‌లోనే తిష్టవేసి పనులు చక్కబెడుతుంటాడు. వీరంతా కలిసి ఇప్పుడు రవాణా శాఖను శాసిస్తున్నారు.