PCCC | హైదరాబాద్, ఫిబ్రవరి7 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ పార్టీ బీసీలను కరివేపాకులా వాడుకున్నది. అసలు ఆ వర్గాలపైనే చిన్నచూపుగా ఉన్నది. ఏడాది దాటినా బీసీ సబ్‌ప్లాన్, ఇతర కులకార్పొరేషన్ల ఏర్పాటు, వృత్తిదారుల సంక్షేమం, నామినేటెడ్ పదవుల్లో కోటా, సరిపోను బడ్జెట్ కేటాయింపులు సహా మ్యానిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడమే లేదు’ అని పీపుల్ కమిటీ ఆఫ్ క్యాస్ట్ సెన్సెస్ (పీసీసీసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులైన ప్రొఫెసర్లు మురళీమనోహర్, తిరమలి, సింహాద్రి, రాధాకృష్ణ, డాక్టర్ వేణుయాదవ్, దేవళ్ల సమ్మయ్య, నరేంద్రబాబు, సుదర్శన్‌రావు, తుల్జారాంసింగ్, పృథ్వీరాజ్‌యాదవ్, సతీశ్ కొట్టె శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.
కులగణనపై కాంగ్రెస్ సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, ఆది నుంచి ఒంటెద్దు పోకడలతో ఇష్టానుసారంగా ముందుకు సాగుతున్నదని ధ్వజమెత్తారు. బీసీ జనాభా తగ్గుదలపై ఆక్షేపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించిందని, కులగణన చేపట్టి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. సర్వే అంశంలో ఇష్టానుసారంగా, ఎలాంటి ప్రామాణిక పద్ధతులను పాటించకుండా, నిపుణులతో ఎలాంటి సంప్రదింపులు జరకుండా, మేధో చర్చలు జరపకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిందని విమర్శించారు.
కనీసం సర్వే పర్యవేక్షణకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో అనేక లోపాలు దొర్లాయని పేర్కొన్నారు. అసంబద్ధంగా వివరాలను సేకరించిందని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్లను సాధించడానికి అవకాశాలు ఉన్నాయని, అందుకు అనుసరించాల్సిన విధానాలను జస్టిస్ ఈశ్వరయ్య వ్యయ ప్రయాసలకోర్చి సీఎంకు నివేదిక సమర్పించారని తెలిపారు. ఇప్పటికైనా నిపుణుల కమిటీ, అన్ని అంశాలపై చర్చించి ఆ దిశగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.