అని ప్రభుత్వం
చెప్తున్నది.. మనం నమ్మాలట!
పైగా విచిత్రమేమిటంటే..
అది బతుకమ్మ ఆట కాదట!
జానపద నృత్యమట! అది కూడా మనం నమ్మాలట!
సరూర్నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం వైభవోపేతంగా.. అత్యంత ఘనంగా.. ఇసుక పోస్తే రాలనంత 1354 మందితో బతుకమ్మ సంబురాలు నిర్వహించింది. ఇది గిన్నిస్ రికార్డు అని ఢంకా బజాయిస్తున్నది. అదీ నమ్మాలట! ఇదే గిన్నిస్ రికార్డు అయితే.. హనుమకొండ వేయిస్తంభాల గుడి.. పద్మాక్షి గుట్ట.. కరీంనగర్ సర్కస్ గ్రౌండ్, మానేరు నదీతీరం, సిద్దిపేట కోమటిచెరువు గట్టున ఐదారు వేల మంది ఆడబిడ్డలు ఒక్కచోట చేరి ఆడే బతుకమ్మ ఏం కావాలి?
అసలు ఇది సద్దుల
బతుకమ్మనో..
‘సజ్జల బతుకమ్మ’నో తెలువని ప్రభుత్వం, మంత్రుల నుంచి
ఇంతకంటే మనం
ఏం ఆశించగలం?
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : బతుకమ్మ… తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి చిహ్నం. తరతరాలుగా బతుకమ్మకు ఓ రూపం కొనసాగుతున్నది. కానీ అలాంటి బతుకమ్మ రూపాన్ని కాంగ్రెస్ సర్కారు మార్చేసింది. ప్రచార యావలో పడిన సర్కారు బతుకమ్మ సహజసిద్దమైన రూపాన్ని పక్కన పెట్టి ఎగ్జిబిషన్లో ఒక ఆటవస్తువు తరహాలో తీర్చిదిద్దిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు సోమవారం సరూర్నగర్ స్టేడియంలో ప్రభుత్వం అధికారికంగా బతుకమ్మ సంబురాలు విమర్శలకు దారితీస్తున్నాయి. అయితే ఇందులో గిన్నీస్ బుక్ రికార్డుల పేరుతో భారీ హంగామా చేసింది. ‘ఇదేందీ.. బతుకమ్మ ఇట్లున్నదీ’ అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ‘బతుకమ్మ ఇలా కూడా ఉంటుందా?’ అని ప్రశ్నించారు.
సరూర్నగర్ ఉత్సవాలు రెండు విభాగాల్లో గిన్నీస్ బుక్లో స్థానం దక్కించుకున్నాయని ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. 64 అడుగుల అతిపెద్ద బతుకమ్మ ఏర్పాటు చేసిన విభాగంలో ఒక రికార్డు, 1354 మంది మహిళలు లయబద్ధంగా బతుకమ్మ జానపదానికి కాలు కదిపారనే విభాగంలో మరో రికార్డు కైవసం చేసుకున్నట్టు తెలిపారు. సాంస్కృతిక వారసత్వంగా వస్తున్న బతుకమ్మ సహజ రూపాన్ని మార్చి గిన్నీస్ రికార్డు ప్రకటించుకోవడం విడ్డూరమని కళాకారులు, సాహితీవేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విచిత్రమైన రూపంలో బతుకమ్మను ఏర్పాటు చేసిన ప్రభుత్వంపై సోషల్మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గతంలో కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఫొటోలు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బతుకమ్మ రూపాలను పోల్చుతున్నారు.
ఏటా వరంగల్ వేయి స్తంభాల గుడి, పద్మాక్షిగుట్ట, ఖిలా వరంగల్, సిద్దిపేట కోమటిచెరువు, కరీంనగర్ సర్కస్ గ్రౌండ్, వేములవాడ, హైదరాబాద్ ట్యాంక్బండ్తోపాటు తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది మహిళలు బతుకమ్మ ఆడటం కొత్తకాదు. కానీ కేవలం ఒకేసారి 1354 మంది బతుకమ్మ ఆడి రికార్డు నెలకొల్పారని ప్రభుత్వం ప్రకటించడం.. బతుకమ్మ ఉత్సవాలను జానపద నృత్యం అని పేర్కొనడం అవమానించడమేనని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిందని, కొత్త విగ్రహంలో బతుకమ్మకు చోటు కల్పించలే దని తెలంగాణ వాదులు గుర్తుచేస్తున్నారు. ఇప్పు డు ఉద్దేశపూర్వకంగానే బతుకమ్మ ప్రాశస్త్యాన్ని చిన్నచూపు చూడటానికి సర్కారీ బతుకమ్మ ఉత్సవాలు వేదికగా నిలవడం బాధాకరమని చెప్తున్నారు.