జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో మంగళవారం కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై వీధిరౌడీల్లా చెలగేరిపోయి దాడి చేశారు. ఇటీవల మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గండ్ర చిత్రాలతో కూడిన భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. మంగళవారం రేవంత్‌రెడ్డి జిల్లాకేంద్రానికి రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు పెడుతున్నారు.
తమ పార్టీ హోర్డింగ్స్ కనపడకుండా కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు కోపంతో ఊగిపోతూ బీఆర్ఎస్ నాయకులను నెట్టివేస్తూ, పిడిగుద్దులు గుద్దుతూ మూకుమ్మడిగా దాడి చేశారు. కాంగ్రెస్ నాయకుల దాడిలో బీఆర్ఎస్ భూపాలపల్లి పట్టణ సోషల్ మీడియా ఇన్చార్జి పూసల యుగేంద్రచారి ఒంటిపై బట్టలు పూర్తిగా చినిగిపోయాయి.
బొంతల సతీష్‌కుమార్ అనే కార్యకర్తకు గాయాలయ్యాయి. దాంతో ఆగకుండా అక్కడున్న బీఆర్ఎస్ నాయకులపై సైతం దాడి చేయడంతో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు దాడిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ నాయకులు ఆగలేదు. పోలీసులపైకి కూడా తిరగబడి, వారినే నెట్టివేస్తూ హంగామా సృష్టించారు. అంతేగాక అంబేద్కర్ సెంటర్లో జాతీయ రహదారిపై ధర్నాకు దిగటంతో గంట సేపు వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయి ప్రజలు ఇబ్బంది పడ్డారు. పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
రాళ్లదాడిలో పోలీస్ అధికారికి తీవ్రగాయాలు
బీఆర్ఎస్ నాయకులపై దాడి తర్వాత కాంగ్రెస్ నాయకులు మరోసారి రెచ్చిపోయారు. భూపాలపల్లిలోని అంబేద్కర్ సెంటర్లో పబ్లిక్ కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యాలయంపై రాళ్లు రువ్వడంతో అక్కడ బందోబస్తులో ఉన్న కాటారం ఎస్సై శ్రీనివాస్ తలకు రాయి బలంగా తగిలి తీవ్ర రక్తస్రావమైంది.
బీఆర్ఎస్ కార్యకర్తలు బోయిని అనిల్, సెగ్గం లింగమూర్తికి రాయి తగిలి గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం దవాఖానకు తరలించారు. పక్కా ప్లాన్‌తో టీపీసీసీ అధ్యక్షుడు ప్రసంగించిన ప్రచార రథంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాళ్లు తీసుకువచ్చి గాయపరిచారు. దాడిలో పక్కనే ఉన్న భూపాలపల్లి ఎమ్మెల్యేకు చెందిన సినిమా హాల్ అద్దాలు పగిలిపోయాయి. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాళ్లు, చెప్పులు, ఖాళీ బీరు సీసాలు, కొబ్బరిబొండాలు విసురుతూ దాడి చేశారు.