హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): ‘అంతన్నడు ఇంతన్నాడే గంగరాజు..’ అన్నట్టుగా తయారైంది ముఖ్యనేత పరిస్థితి. కేరళలో కాంగ్రెస్ విజయానికి తానే ప్రధాన కారణమని, ముఖ్యమంత్రి ఎంపికలో తన మాటే నెగ్గుతుందని ఊదరగొట్టిన ముఖ్యనేత పరువు పోయిందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. ముఖ్యనేత తన గురువును గద్దెనెక్కించేందుకు తెలంగాణ నుంచి మూటలు పంపితే.. అధిష్ఠానం స్థానికంగా ఉండి పార్టీ కోసం పనిచేసిన నేతనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. వీడీ సతీశన్‌ను కేరళ సీఎంగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యనేత గురించి చర్చ జరుగుతున్నది.
140 అసెంబ్లీ సీట్లున్న కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమికి 102 సీట్లు దక్కిన సంగతి తెలిసిందే. ఇదే అదనుగా ముఖ్యనేత వర్గం హడావుడి చేసింది. ముఖ్యనేత పదునైన విమర్శలు, రాజకీయ వ్యూహాలు, ఆకర్షణీయమైన ప్రసంగాలు కేరళలో పినరయి విజయన్ హ్యాట్రిక్ ఆశలపై నీళ్లు చల్లాయని ప్రచారం చేశారు. విజయన్ సరార్‌పై ఉన్న అవినీతి ఆరోపణలు, నిరుద్యోగ సమస్యలను ముఖ్యనేత తన ప్రసంగాల్లో ఎండగట్టడంతో యూడీఎఫ్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, దాని ప్రభావమే ఎన్నికల్లో విజయమని ప్రచారం చేసుకున్నారు.
విజయన్ను ఇంటికి పంపించి, కేరళలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించడంలో ముఖ్యనేత కీలక పాత్ర పోషించారని ఒక వర్గం సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కలిసి తెలంగాణలో, కేరళలో తెగ ప్రచారం చేశాయి. ఈ విజయంతో దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యనేత తిరుగులేని శక్తిగా మారబోతున్నారని, జాతీయ రాజకీయాల్లో ఆయన స్థాయి మరింత పెరిగిందని డబ్బా కొట్టాయి. ఆయన సూచించిన నేతకే కేరళ ముఖ్యమంత్రి పదవి ఇస్తారని హడావుడి చేశాయి.
ముఖ్యనేత వర్గం అభిప్రాయాన్ని ఏఐసీసీ ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. కేరళలో స్థానికంగా ఉండి పార్టీని బలోపేతం చేసిన వీడీ సతీశన్ వైపు కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు చూపింది. ముగ్గురు సీనియర్ నేతలు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడగా చివరకు సతీశన్‌ను రాహుల్‌గాంధీ ఖరారు చేశారు. పాతికేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు దాటుకొని వచ్చిన సతీశన్.. తన న్యాయవాద బుర్రతో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారని స్థానిక ప్రజలు చెప్తున్నారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ముఖ్యనేత ఎకాఎకిన ఢిల్లీ వెళ్లారు. రోజంతా అక్కడే ఉన్నారు. ఆ సమయంలో కేరళకు కాబోయే సీఎం ఎవరు? అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా జరుగుతున్నది. పలువురి పేర్లు బయటికి వచ్చాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ చిక్కుముడిని విప్పటానికి తనను ఢిల్లీకి పిలిపించిందని సోషల్ మీడియాలో బిల్డప్ ఇచ్చారు. వాస్తవానికి ఆయన్ను ఎవరూ ఆహ్వానించలేదని అప్పట్లో కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరిగింది. ఫలితాలు వెలువడి 10 రోజులు గడుస్తున్నా.. అభ్యర్థిని ఎంపిక చేయకుండా ఏఐసీసీ తాత్సారం చేయటానికి మన ముఖ్యనేతే కారణం అని, ఆయన తన గురువును ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి పట్టుబడుతున్నారని ప్రచారం చేశారు. తెలంగాణ నుంచే మంత్రాంగం చేసి 47 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారని, అధిష్ఠానానికి ఇష్టం లేకపోయినా ఢిల్లీ మెడలు వంచి తన గురువుకు పీఠం కట్టబెడ్తారని గప్పాలు కొట్టింది.