Telangana |హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చరిత్రలోనే రేవంత్రెడ్డి ప్రభుత్వం అరుదైన రికార్డును సృష్టించింది. ఈ ఏడాది జూలైలో ఏకంగా రూ.10,392 కోట్ల అప్పు చేసింది. తద్వారా గత పదేండ్లలో ఎన్నడూ లేనివిధంగా ఒకే నెలలో రూ.10 వేల కోట్లకుపైగా అప్పుతో ‘చరిత్ర’ సృష్టించింది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు నివేదించింది. రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చిందంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూనే రేవంత్ సర్కారు ‘అంతకు మించి’ అనే స్థాయిలో ఎడాపెడా అప్పులు చేస్తున్నదనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం.
రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జూలైలో వచ్చిన ఆదాయం కంటే రేవంత్రెడ్డి సర్కారు తెచ్చిన అప్పే ఎక్కువ. జూలైలో పన్నుల రూపేణా దాదాపు రూ.9,966 కోట్లు, నాన్-ట్యాక్స్ రెవెన్యూ కింద రూ.257 కోట్లు, లోన్లు, అడ్వాన్సుల రికవరీ రూపంలో రూ.3.62 కోట్లు కలిపి రాష్ర్టానికి మొత్తంగా రూ.10,226.46 కోట్ల ఆదాయం వచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఇదే నెలలో ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ.10,392.71 కోట్లు. ఈ లెక్కన రాష్ర్టానికి వచ్చిన ఆదాయం కంటే అప్పే రూ.141.13 కోట్లు ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి 4 నెలలను పరిశీలిస్తే జూలైలో రాబడి గణనీయంగా తగ్గినట్టు స్పష్టమవుతున్నది. ఏప్రిల్లో రూ.11,821 కోట్లు, మే నెలలో రూ.11,332 కోట్లుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం.. జూన్లో రూ.12,465 కోట్లకు పెరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. దీనితో పోలిస్తే జూలైలో ప్రభుత్వ రాబడి రూ.2,239 కోట్లు, నిరుడు ఇదే సమయంలో వచ్చిన రాబడి కంటే రూ.1,091 కోట్లు తగ్గింది.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అత్యధికంగా ఒకే నెలలో చేసిన అప్పు రూ.9,897 కోట్లు మాత్రమే. 2020 డిసెంబర్లో ఆ రుణాన్ని తీసుకున్నది. అయితే ఆ ఏడాది కరోనా విజృంభించడం, లాక్డౌన్ తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు స్తంభించాయి. ప్రభుత్వాలకు రాబడి పడిపోయింది. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వ నిర్వహణతోపాటు సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు కేసీఆర్ ప్రభుత్వం 2020 డిసెంబర్లో భారీగా రుణం తీసుకోవాల్సి వచ్చింది. కానీ, ఈ ఏడాది జూలైలో అలాంటి పరిస్థితులేమీ లేవు. అయినా ప్రజాపాలన పేరుతో రేవంత్రెడ్డి సర్కారు ఒకే నెలలో రూ.10 వేల కోట్లకుపైగా అప్పు చేసింది. అయినా ఆ అప్పుతో కొత్త పథకాన్నో, ప్రాజెక్టునో చేపట్టిన దాఖలాలేమీ లేకపోవడం గమనార్హం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.69,012 కోట్ల అప్పులు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో బహిరంగ మార్కెట్ నుంచి రూ.57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1,000 కోట్లు సమీకరించనున్నట్టు బడ్జెట్లో వివరించింది. కానీ, ఇప్పటివరకు బాండ్ల వేలం ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి రూ.31 వేల కోట్ల రుణాలు సేకరించింది. అంటే ఈ ఏడాది బడ్జెట్లో పెట్టుకున్న లక్ష్యంలో సగానికిపైగా అప్పును కేవలం 5 నెలల్లోనే చేసిందన్నమాట. దీంతో మిగతా 7 నెలల్లో రేవంత్ సర్కారు రాష్ట్ర ప్రజల నెత్తిపై ఇంకెంత అప్పుల మూటను పెడుతుందోనని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాండ్ల వేలం ద్వారా ఈ నెల 3న రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి రూ.2,500 కోట్ల అప్పు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మంగళవారం మరో రూ.1,500 కోట్ల రుణాన్ని తీసుకున్నది. దీంతో వారం రోజుల్లోనే రూ.4 వేల కోట్ల అప్పు తీసుకున్నట్టయింది. దీంతో గత 9 నెలల్లో రేవంత్రెడ్డి సర్కారు ఆర్బీఐ నుంచి తెచ్చిన అప్పులే రూ.46,118 కోట్లకు చేరాయి.