హైదరాబాద్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ) : గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ సర్కారు ‘గ్రాఫిక్ సినిమా’ను చూపించింది. చంద్రబాబు కలల నగరం అమరావతి గ్రాఫిక్స్‌ను తలదన్నేలా ఫ్యూచర్‌సిటీ మాయాదృశ్యాలను ఆవిష్కృతం చేసింది. ఏఐ వీడియోలతో రంగుల ప్రపంచానికి తెరలేపి, వాస్తవికతకు దూరంగా గ్రాఫిక్స్‌తో ఆకాశాన్నం టే భవంతులు, మిరుమిట్లు గొలిపే కాంతులు, బుల్లెట్ రైల్, విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, మూసీపై వంతెనలు, వాకింగ్‌ట్రాక్‌లు, సైకిల్‌ట్రాక్‌లు, అక్కడక్కడ అందమైన వాటర్ ఫౌంటేన్లతో అబ్బో.. అనిపించేలా మాయాజాలం చూపింది. సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్‌సిటీకి ‘ఫ్యూచర్’ ఉంటుందో లేదోగానీ ‘గ్రాఫిక్ సిటీ’ మాత్రం అదిరిపోయిందంటూ అన్నివైపుల విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి.
ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ సర్కారు ఇప్పటి వరకు ఇటుక పేర్చలేదు, పనులు ప్రారంభించిందీ లేదుగానీ, ఏఐతో మాత్రం సాధ్యంకాని రీతిలో గ్రాఫిక్ నగరాన్ని ఆవిష్కరించింది. రైజింగ్ తెలంగాణ, భారత్ ఫ్యూచర్‌సిటీపై కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి 2.55 నిమిషాల నిడివి గల వీడియో సాంగ్‌ను విడుదల చేసి, సహజత్వానికి భిన్నంగా, వాస్తవానికి దూరంగా కలల నగరాన్ని కండ్లముందు ఉంచింది. ‘గేట్‌వే ఆఫ్ హైదరాబాద్’ అంటూ పేరు పెట్టడమేకాకుండా తోరణాన్ని కూడా ఏర్పాటు చేసి దుబాయ్‌లో ఉన్నట్లుగా ఆకాశాన్నంటే భవనాలను చూపడమేకాక పరిశ్రమలు వచ్చినట్లు, ప్లాంట్లు స్థాపించినట్లుగా మాయాజాలాన్ని క్రియేట్ చేసింది. మూసీ నదికి ఇరువైపుల అద్దాల మేడలు, అందులో అక్కడక్కడ తెలంగాణతో సంబంధం లేదన్నట్టుగా ఉన్న విద్యార్థులను చూపిన ప్రభుత్వ అత్సుత్సాహంపై అంతా పగలబడి నవ్వుకుంటున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిపై మాయా ప్రపంచాన్ని చూపించారనే విమర్శలు వెల్లువెత్తాయి. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొని అమరావతి నగరంపై రూపొందించిన గ్రాఫిక్ వీడియోలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఇటుక పేర్చలేదు, నిర్మాణం మొదలుకాలేదుగానీ ఆకాశ హర్మ్యాలు, విశాలమైన రోడ్లు అంటూ ఊదరగొట్టిన తీరుగానే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్‌సిటీ గ్రాఫిక్స్‌ను రూపొందించారనే బహిరంగ విమర్శలు గుప్పుమంటున్నాయి. అప్పటి టెక్నాలజీతో ఆయన వీడియో తయారు చేయిస్తే, రేవంత్ ఏకంగా లేటెస్ట్ టెక్నాలజీ ఏఐతో అమరావతిని తలదన్నేలా ఫ్యూచర్‌సిటీ గ్రాఫిక్‌ను సృష్టించి గురువును మించిన శిష్యుడయ్యాడని నిరూపించుకున్నాడు.
నాలుగు గోడల నడుమ కాదు, నాలుగుకోట్ల ప్రజల అభిప్రాయం మేరకు రూపొందించిందే తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ విజన్ అని ప్రభుత్వం గప్పాలు చెప్పుకుంటుండగా, అదంతా ఉత్తుత్తిదే అని తేలిపోతున్నది. అసలు విజన్ డాక్యుమెంట్‌పై అభిప్రాయాలు సేకరించలేదనే విషయం ప్రజలందరికీ తెలిసిందే. దీంతో ప్రభుత్వం చెప్పేది అబద్ధమే అని, 83 పేజీలతో రూపొందించిన డాక్యుమెంట్ మొత్తం చాట్‌జీపీటీ ఆధారంగా తయారు చేసిందని, అందులోని సమాచారాన్ని ఎత్తిపోశారనే (కాపీ పేస్ట్) విమర్శలూ వినిపిస్తున్నాయి. దానిని రూపొందించే బాధ్యత కూడా ప్రభుత్వ శాఖలకు కాకుండా ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించినట్లుగా సమాచారం. మొత్తంగా విజన్ పేరుతో పోజులు కొడుతున్న డాక్యుమెంట్లో ఏఐ సాంకేతికతో పాటు గ్రాఫిక్ జోడించడం కొసమెరుపు.