సూర్యాపేట, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలన ఏ మాత్రం అర్థంపర్థం లేకుండా సాగిందని, ముఖ్యమంత్రి,మంత్రుల మధ్య సమన్వ యంలేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ చేయలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ అని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధుకే దిక్కు లేదని విమర్శించారు. రెండు లక్షల రుణమాఫీపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చక, వచ్చిన సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.49 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి రూ. 31 వేల కోట్లకు కుదించి చివరకు బడ్జెట్లో రూ.26 వేల కోట్లు కేటాయించి రూ.18 వేల కోట్లు విడుదల చేసి రైతులకు రూ.10 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసిందని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రుల చెబుతున్న మాటలకు పొంతన లేదని, రెండు లక్షల పైన రుణం ఉంటే బ్యాంకులో కట్టాలని చెబితే రైతులు అప్పు చేసి బ్యాంకుల్లో ఇప్పటికే జమ చేశారని తెలిపారు.
ప్రస్తుతం వ్యవసాయశాఖ మంత్రి రూ.2 లక్షల పైన రుణం కట్టవద్దని అనడం తప్పించుకునే ప్రయత్నమని దుయ్యబట్టారు. రెండు లక్షలకు పైన రుణం కడితేనే మాఫీ వర్తిస్తుందని బ్యాంకర్లు రైతులను ఇబ్బందులు పెట్టి కట్టించుకున్నారని చెప్పారు. ఇప్పటికైనా రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని, ఎగ్గొట్టే ఆలోచన ఉంటే అదైనా చెప్పాలని డిమాండ్ చేశారు. వానకాలం పెట్టుబడికి రైతులు అప్పు చేసి పెట్టుబడి పెట్టారని పంట చేతికి వచ్చే సమయం ఆసన్నమైనా నేటికి రైతు భరోసా ఇవ్వలేదని మండిపడ్డారు. సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, ములుగు, ఆదిలాబాద్ ప్రాంతాల్లో రైతులు పంట నష్టపోయారని వారికి వెంటనే రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.