హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఆర్థిక అవసరాలు, సంక్షేమ పథకాల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల అమలు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా బహిరంగ మారెట్ రుణాలపై ఆధారపడుతున్నది. తాజాగా మరో రూ.2,000 కోట్ల అప్పు సమీకరించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ సిద్ధమైంది. సెప్టెంబర్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్వహించే సెక్యూరిటీల ఈ-వేలం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించేందుకు ఆర్థికశాఖ ఇండెంట్ పంపింది. ఈ విషయాన్ని ఆర్బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు కూడా పూర్తికాకముందే ప్రభుత్వం మారెట్ రుణాల ద్వారా భారీ మొత్తాన్ని సమీకరించడం ఆర్థిక నిర్వహణపై చర్చకు దారితీస్తున్నది. సెప్టెంబర్ 1న ప్రతిపాదించిన రూ.2,000 కోట్లతో కలిపితే 2026-27లో ఇప్పటివరకు ఆర్బీఐ వేలాల ద్వారా సమీకరించే అప్పు రూ.38,900 కోట్లకు చేరనున్నది.
2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన రాష్ట్ర వార్షిక రుణ పరిమితి రూ.58,458.71 కోట్లు. ఇందులో సెప్టెంబర్ 1న ప్రతిపాదించిన రూ.2,000 కోట్లను కలుపుకుంటే రూ.38,900 కోట్లు సమీకరించినట్టవుతుంది. అంటే మొత్తం వార్షిక రుణ పరిమితిలో సుమారు 66.5% ఇప్పటికే వినియోగించినట్లవుతుంది. ఆర్థిక సంవత్సరం ఇంకా సగం కూడా పూర్తికాకముందే రుణ పరిమితిలో మూడింట రెండొంతుల మేరకు చేరుకోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
మిగిలిన నెలల్లో జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ఇతర ప్రభుత్వ వ్యయాలకు మరిన్ని నిధులు అవసరమయ్యే నేపథ్యంలో అప్పుల అవసరం మరింత పెరిగే అవకాశాలపై చర్చ జరుగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ప్రతి నెలా ఆర్బీఐ నిర్వహించే బహిరంగ మారెట్ వేలాల ద్వారా అప్పులు సమీకరిస్తున్నది. ఏప్రిల్లోనే రూ.6,900 కోట్లు, మేలో రూ.6,000 కోట్లు, జూన్లో మరో రూ.6,000 కోట్లు తీసుకున్నది. జూలైలో ఏకంగా రూ.13,500 కోట్ల రుణాన్ని సమీకరించింది. ఆగస్టులో రూ.4,500 కోట్ల మేర అప్పు తీసుకున్నది. తాజాగా సెప్టెంబర్ 1న మరో రూ.2,000 కోట్ల కోసం ఇండెంట్ పంపింది.
అభివృద్ధి ప్రాజెక్టులు, ఆదాయం సమకూర్చే మౌలిక వసతుల కోసం రుణాలు తీసుకోవడం సాధారణ ఆర్థిక విధానమే. అయితే తీసుకున్న అప్పును ఏ రంగానికి వినియోగిస్తున్నారు? దాని ద్వారా భవిష్యత్తులో ఆదాయం ఎంత వస్తుంది? అప్పు, వడ్డీని తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వానికి తగిన ఆదాయ వనరులు ఉన్నాయా? అనే అంశాలు కీలకం. ఈ నేపథ్యంలో రుణ పరిమితిలో 66.5 శాతానికి చేరువైన సమీకరణ ఐదు నెలలు పూర్తికాకముందే ఎందుకు అవసరమైంది? మిగిలిన ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం అనుసరించబోయే రుణ వ్యూహం ఏమిటి? అనే ప్రశ్నలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
సెప్టెంబర్ 1న మరో రూ.2,000 కోట్ల అప్పు తీసుకున్న తర్వాత వార్షిక రుణ పరిమితిలో దాదాపు రూ.19,559.71 కోట్లు మాత్రమే మిగులుతాయి. అయితే, ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా అనేక నెలలు ఉండటంతోపాటు ప్రభుత్వ వ్యయ అవసరాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మిగిలిన రుణ పరిమితిని ఎలా వినియోగించబోతున్నారనేది కీలకంగా మారింది. సంక్షేమం, అభివృద్ధి పేరుతో అప్పులు చేయడం కంటే, సొంత ఆదాయాన్ని పెంచి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని ఆర్థిక నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.
