‘మూత్రవిసర్జనకు వెళ్లకండి.. డైపర్లు వేసుకోండి’ అంటూ మహిళా కార్మికుల పట్ల సూపర్వైజర్ వేధిస్తున్నాడని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం అర్జునపట్ల గ్రామంలోని సింప్లిఫ్రెష్ కంపెనీ ఉద్యోగులు ఆరోపించారు. తనతో సాన్నిహిత్యంగా ఉంటేనే జీతం పెంచుతానని అంటున్నాడని.. లేదంటే అవమానకరంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడని వాపోయారు.
రోజుకు కేవలం రూ.400 వేతనం మాత్రమే ఇస్తున్నారని ఆరోపిస్తూ కార్మికులు కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కార్మికులతో మాట్లాడగా.. మహిళా కార్మికులు సూపర్వైజర్ తమను వేధిస్తున్నాడంటూ తమ ఆవేదనను వెల్లడించారు.
పని సమయంలో మూత్రవిసర్జన కోసం వెళ్లకుండా డైపర్లు వేసుకోవాలని సూపర్వైజర్ చెబుతున్నాడని మహిళా కార్మికులు ఆరోపించారు. తనతో సాన్నిహిత్యంగా ఉంటే వేతనాలు పెంచుతానని, అందుకు అంగీకరించకపోతే అవమానకరంగా మాట్లాడుతున్నాడని తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళా కార్మికుల పట్ల కూడా సూపర్వైజర్ వివక్షతో వ్యవహరిస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తమపై జరుగుతున్న వేధింపులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే ఫిర్యాదు చేస్తే ఉద్యోగాలు పోతాయనే భయంతో మహిళా కార్మికులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం.