హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): మైనారిటీలకు చెందిన శతాబ్దాల కాలం నాటి వారసత్వ సంపద మనుగడను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తున్నది. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్ ప్రాంగణంలోని ‘ద అబుల్ కలాం ఆజాద్ ఓరియంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ను ఉన్నఫలంగా ఖాళీ చేయించింది. ఎంతో మందికి విజ్ఞాన ఫలాలను అందించిన ఈ ఇన్స్టిట్యూట్ను నిర్వీర్యం చేసేలా, అందుబాటులో ఉండే పరిశోధన, ఆధ్యాత్మిక, ఇతిహాస, ఖురాన్‌కు చెందిన పురాతన గ్రంథాలను ప్రమాదంలో పడేసేలా వ్యవహరిస్తున్నది.
పబ్లిక్ గార్డెన్ ప్రాంగణంలో ఉండే మసీద్‌లో 1958లో మౌలనా అబుల్ కలాం ఆజాద్ పరిశోధన కేంద్రాన్ని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో కీలక గ్రంథాలను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది. మైనారిటీల అభ్యున్నతికి కీలకమైన ఆధారాలను అందించే ఎన్నో గ్రంథాలు, చారిత్రక వైభవాన్ని చాటే పరిశోధనా పత్రాలు, క్రీస్తుపూర్వం నాటి అరుదైన మాన్యుస్క్రిప్ట్‌లను కలిగి ఉన్న ఈ కేంద్రం మైనారిటీ మేధావులకు విజ్ఞాన భాండాగారంగా గుర్తింపు ఉన్నది. ఎంతో మంది మేధావులు, చరిత్రకారులకు ప్రత్యక్ష ఆధారంగా నిలుస్తూ సేవలు అందిస్తున్నది.
13వ శతాబ్దానికి చెందిన మాన్యుస్క్రిప్టులు కూడా ఇక్కడా ఉన్నాయని, ఇరాన్ చివరి రాజు రేజా షా పహ్లావీ(1919-1980)కి కానుకగా ఇచ్చిన ఖురాన్‌తోపాటు, ఖురాన్, రామాయణ, భవగద్గీత వంటి ఇతిహాసాలు కూడా ఉన్నాయని, వీటితోపాటు, ఖగోళ, వైద్యం, ప్రాచీన కాలం నాటి సాహిత్య గ్రంథాలు కూడా ఉన్నాయని నిర్వాహకులు చెప్తున్నారు. వీటిని అధ్యయనం చేసేందుకు మనదేశంతోపాటు ఇరాన్, సౌదీ, యూరప్ వంటి దేశాల నుంచి సైతం పరిశోధకులు వస్తుంటారని అన్నారు.
ఇప్పుడు ప్రభుత్వం మసీద్ విస్తరణ పేరిట పరిశోధనా కేంద్రాన్ని బలిపీఠం ఎక్కించింది. మైనారిటీ వర్గానికి చెందిన మైనారిటీ శాఖ మంత్రి సారథ్యంలో ఈ తరలింపు జరుగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్స్టిట్యూట్ విషయంలో తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ తన బాధ్యతలను విస్మరించిందని ఆరోపిస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మంత్రి ఆదేశాలతో ఇన్స్టిట్యూట్ను ఖాళీ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డు అధికారులు కార్యాలయాన్ని సందర్శించి శనివారం నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఇతిహాస, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక పండితులు, మేధావులు వందల ఏండ్ల కిందట రాసిన సాహిత్యానికి రక్షణ కరువైందని వాపోతున్నారు.
మసీదు విస్తరణ పేరిట పరిశోధనా కేంద్రాన్ని మూసివేయడం వెనుక అసలు కారణం వేరే ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరుతో ఈ సంస్థ ఉండటమే సర్కార్‌కు కంటగింపుగా మారిందనే ప్రచారం జరుగుతున్నది. సంస్థను నిర్వహిస్తున్న చైర్మన్ ప్రొఫెసర్ అష్రఫ్ రఫీ మాట్లాడుతూ వందల ఏండ్ల నాటి పత్రాలు, గ్రంథాలు ఉండే సంస్థను పరిరక్షించాల్సిందిపోయి ప్రమాదంలో పడేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
చారిత్రక సాహిత్య కేంద్రమైన రీసెర్చ్ సెంటర్‌ను ఉన్నఫలంగా ఎలా ఖాళీ చేయాలి? విలువైన విజ్ఞాన సంపద తరలింపు సమయంలో ఎలా భద్రత కల్పించాలి? ఏవైనా లోపాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రీసెర్చ్ సెంటర్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని మేధావులు సాంస్కృతిక దాడిగా పరిగణిస్తున్నారు. మసీద్ విస్తరణను ఎవరూ అడ్డుకోవడం లేదన్నారు. అయితే పురాతన సాహిత్య వైభవాన్ని చాటే ఇన్స్టిట్యూట్కు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం లేదంటే దీని వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. విజ్ఞానాన్ని అందించే పురాతన సాహితీ సంపదను కాపాడలేని ఆ శాఖ, కాంగ్రెస్ సర్కార్ ఇక మైనారిటీల సంక్షేమానికి ఏ విధంగా కృషి చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.