బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకే కొనసాగిస్తున్నది. వాటికి సంబంధించి నిధులను మాత్రం సరిగా విడుదల చేయడం లేదు. నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ తదితర విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు రూ.10వేల కోట్లు పేరుకుపోయాయి. గడచిన 32 నెలలుగా ఒక్క రూపాయీ విదల్చలేదు. దీంతో కోర్సులు పూర్తి చేసుకున్నా విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
విదేశాల్లో ఉన్నత విద్యకు సంబంధించి ఆర్థిక సాయం అందించే ఓవర్సీస్ స్కీమ్కుల దరఖాస్తులను స్వీకరించడం, ఎంపికలకే పరిమితమైంది తప్ప పైసా విదల్చడం లేదు. పథకం కోసం రూ.607 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, వెయ్యిరోజుల్లో ఇచ్చింది రూ.53 కోట్లు మాత్రమే. దీంతో 4,944మంది విద్యార్థులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
దళిత, గిరిజన విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద కార్పొరేట్ స్కూళ్లలో విద్యకు అవకాశం కల్పిస్తారు. విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలి. ఈ స్కీమ్‌కు సంబంధించి రూ.250కోట్లను పభుత్వం విడుదల చేయడంలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సుమారు 40వేల మంది దళిత, గిరిజన విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర ఆర్థిక సాయం, పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. రా్రష్ట్రవ్యాప్తంగా దాదాపు 4,088 మంది అట్రాసిటీ బాధితులున్నారు. వారికి దాదాపు రూ.70కోట్ల మేర పరిహారం బకాయిలు రావాల్సి ఉన్నది. వెయ్యిరోజుల్లో బాధితులకు నామమాత్రంగా రూ.5.59 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినా, అవి ఇప్పటికీ జమ కాలేదు. నాయీబ్రాహ్మణ, రజకులకు 250యూనిట్ల ఉచిత విద్యుత్తుకు సంబంధించి రూ.260కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. అనేక స్కీములకు సంబంధించిన నిధుల విడుదల నిలిచిపోయింది.
ఆదివాసీ, గిరిజనుల పండుగలు, జాతరల నిర్వహణకు సైతం నిధులను విదల్చని పరిస్థితి.
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ‘ప్రజల పనియే పాలకుని పని. ప్రజల సుఖమే పాలకుని సుఖం. ప్రజల ప్రియమే పాలకుని ప్రియం. ప్రజల హితమే పాలకుని హితం’.. ఇవీ మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పిన రాజనీతి హితవచనాలు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిని ఆచరణలో తూచా తప్పకుండా అమలు చేశారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు. పేద, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబీమా, రైతుబంధు తదితర వినూత్న, విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టి సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పారు.
దేశానికి కొత్తదారిని చూపారు. కానీ.. ఇప్పుడు కాంగ్రెస్ వెయ్యి రోజుల్లోనే పరిస్థితి తారుమారయ్యింది. ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, చేవెళ్ల, కామారెడ్డి, మైనారిటీ తదితర డిక్లరేషన్ల పేరిట సర్కార్ అరచేతిలో వైకుంఠం చూపించింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మొండిచేయి చూపుతున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో సంక్షేమ శాఖలు సంక్షోభంలో కూరుకుపోయాయి. దేశానికి దిక్సూచిలా నిలిచిన కేసీఆర్ పథకాలు ఒక్కొక్కటిగా అటకెక్కుతున్నాయి.
అమలు చేస్తున్న స్కీములకు అత్తెసరు నిధులను కేటాయించడమేగాక, అవీ విడుదల చేయని దుస్థితి నెలకొన్నది. చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్లు ఉత్తముచ్చటగా మిగిలాయి. మైనారిటీ డిక్లరేషన్ బోగస్‌గా మారింది. రుణాల మంజూరు, ఉపాధి, నైపుణ్య శిక్షణలకు నిధుల్లేక కార్పొరేషన్లు కునారిల్లిపోతున్నాయి. కొత్త పథకాల జాడ లేదు. ఉన్న పథకాలకు దిక్కులేదు. గురుకులాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు అర్ధంతరంగా ప్రాణాలు విడుస్తున్నారు. సంక్షేమ శాఖలకు కీలక అధికారులు లేకపోవడంతో పాలన గాడి తప్పింది. పథకాల అమలు గతితప్పింది. సంక్షేమ రంగం కాస్తా సం‘క్షామ’రంగంగా మారిపోయింది.
కార్పొరేషన్ల ఏర్పాటుపై కాంగ్రెస్ హామీలు ఉత్తమాటలుగా మిగిలిపోయాయి. బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి యువతకు రూ.10లక్షల వరకు పూచీకత్తు లేకుండా, వడ్డీలేని రుణాలను అందిస్తామంటూ పార్లమెంట్ ఎన్నికల ముందు హడావుడిగా పలు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కానీ గడిచిన వెయ్యిరోజుల్లో కార్పొరేషన్లకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన 8 బీసీ కులాలు రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, సగర (ఉప్పర) వాల్మీకి బోయ, కృష్ణబలిజ, భట్రాజ్, కుమ్మరి ఫెడరేషన్లను సైతం కార్పొరేషన్లుగా మార్చాలని నిర్ణయించినా ఇప్పటికీ ఉత్తర్వులు రాలేదు.
మాల, మాదిగలకు, ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పినా ఆచరణకు నోచుకోలేదు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ 2025-26 సంవత్సరానికి సంబంధించి రూ.863 కోట్లతో ఎస్సీ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయడంతోపాటు, 80వేల మంది నుంచి దరఖాస్తులను స్వీకరించినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రైకార్ ద్వారా గిరిజనులకు సబ్సిడీ రుణాలను మంజూరు చేసింది. 30 వేల మందిని లబ్ధిదారులుగా గుర్తించి రూ.265 కోట్లను సబ్సిడీ రుణాలుగా అందివ్వాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ హయాంలోనే 45.81కోట్లు విడుదల చేసింది. మిగతా రూ.219.19 కోట్లను ఇప్పటికీ ఇవ్వడం లేదు.
రాజీవ్ యువవికాసం స్కీమ్ కింద దరఖాస్తులు తీసుకుని ఏడాదిన్నర గడిచినా అతీగతీ లేకుండా పోయింది. దాదాపు 16.27లక్షల మంది యువత ఎదురు చూస్తున్నారు.
వెచ్చించిన నిధులు: రూ.2,86,230 కోట్లు
2014లో పేదరికం: 21.92 శాతం
2023 నాటికి పేదరికం: 5.8 శాతం
తగ్గుదల: 16.12 శాతం
రాష్ట్ర ఏర్పాటు నాటికి తెలంగాణ సమాజం చిన్నాభిన్నమై, దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా సంక్షేమ రంగం కునారిల్లింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తొలి ప్రాధాన్యతగా సంక్షేమ కార్యక్రమాలను ఎంచుకున్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, కార్మికులు.. ఇలా సబ్బండవర్గాల కోసం మానవీయకోణంలో ఆలోచించారు. అనేక వినూత్న, విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. విద్య, వైద్యంతోపాటు సామాజిక భద్రత పథకాలతో భరోసా కల్పించారు.
అనేక వర్గాలవారికి నేరుగా ఆర్థిక సాయం అందించగా, అనేక రంగాలు పునరుజ్జీవం పొందేలా నిధులు కేటాయిస్తూ వెన్నుదన్నుగా నిలిచారు. తొమ్మిదిన్నరేండ్లలో సబ్బండవర్గాల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.2,86,230 కోట్ల నిధులను వెచ్చించింది. కరోనా సమయంలోనూ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడం కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనం. ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ చర్యల ఫలితంగా రాష్ట్రంలో పేదరికం తగ్గింది. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో పేదరికం 21.92 శాతం ఉండగా, 2023 నాటికి 5.8 శాతం తగ్గింది.
హామీ: 42 %రిజర్వేషన్లు
అమలు: అసెంబ్లీ
తీర్మానాలతో సరిపెట్టింది
హామీ: 50 ఏండ్లకే పెన్షన్
అమలు: ఆ ఊసే ఎత్తడం లేదు
హామీ: కాంట్రాక్టుల్లో గౌడ్లకు 25శాతం రిజర్వేషన్
అమలు: ఆ ఊసే ఎత్తడం లేదు
కాంగ్రెస్ ఎన్నికల ముందు బీసీలకు చెప్పిందొకటి.. ఇప్పుడు చేస్తున్నది మరొకటి. అధికారంలోకి రాగానే 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఊదరగొట్టింది. రూ.160 కోట్లు వెచ్చించి సర్వే చేయించింది. అసెంబ్లీలో బిల్లులు పెట్టి తుదకు దానిని అటకెక్కించింది. బీసీ సబ్‌ప్లాన్ కింద బడ్జెట్లో ఏటా రూ.20 వేల కోట్ల కేటాయింపు కూడా ఉత్తముచ్చటే అయ్యింది. ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు, కులవృత్తిదారులకు 50 ఏండ్లకే పింఛన్ల మంజూరుకు దిక్కులేదు. కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకీ ఎన్నికల నిర్వహణ, రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్న హామీ మిథ్యగానే మిగిలింది.
కులవృత్తిదారులకు ఉపకరణాల పంపిణీ ఊసేలేదు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో గౌడ్లకు 25శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏలో చేర్చడం, బీసీ వర్గాల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు (ఎంబీసీ) కార్పొరేషన్లు, ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి, స్వయం ఉపాధికి రుణాలు ఇస్తామని చెప్పి మరిచిపోయింది. కామారెడ్డి, చేవెళ్ల డిక్లరేషన్లలో ఇచ్చిన ఒక్క హామీని ఇప్పటికీ అమలు చేయలేదు.
మరోవైపు గత బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలకు గడ్డకాలం దాపురించింది. బీసీబంధు పథకాన్ని, ఈ ఆటో రిక్షాల పంపిణీని రేవంత్ సర్కార్ పక్కకు పెట్టింది. రజక, నాయీబ్రాహ్మణులకు ఉచితంగా 250 యూనిట్ల విద్యుత్తు పథకానికి సంబంధించి కొత్త కనెక్షన్ల మంజూరు, గొర్రెల పంపిణీ, చేనేత రంగానికి సంబంధించి బీమా, త్రిఫ్ట్ స్కీమ్‌లను నిలిపేసింది. ప్రమాదవశాత్తు మరణించిన గీతకార్మికులకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాను పెంచలేదు. అత్యవసర ఖర్చులకు అందించే ఆర్థిక సాయాన్ని నిలిపేసింది. బీసీ యువతకు, వివిధ కులవృత్తిదారులకు ఆయా రంగాల్లో వృత్తినైపుణ్య, ఉపాధి శిక్షణ కార్యక్రమాలేవీ లేకుండాపోయాయి.
హామీ: ప్రతినెలా రూ.2,500
అమలు: ఊసే ఎత్తడం లేదు
హామీ: యువతులకు స్కూటీలు
అమలు: నీటి మీద రాతలే!
ఎన్నికల సమయంలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ అలవిగాని హామీలు గుప్పించి, నమ్మించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమల్లో మోసం చేసింది. మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పి ధోకా ఇచ్చింది. 18 ఏండ్లు దాటిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేస్తామని చెప్పి చేతులెత్తేసింది. కల్యాణలక్ష్మి పథకంలో అదనంగా తులం బంగారం పంపిణీపై ప్రజలు ఎన్నిసార్లు నిలదీసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. బంగారుతల్లి పథకం పునరుద్ధరణ, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు వంటివాటి ఊసేలేదు.
అంగన్వాడీల వేతనం పెంచలేదు. ఆశావర్కర్ల వేతనం పెంచకపోగా, ఇంటింటి సర్వేకు సంబంధించిన రెమ్యునరేషన్‌ను కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. వడ్డీరుణాల పంపిణీ బోగస్‌గా మారింది. 20 లక్షల వరకు వడ్డీలేకుండా రుణం అందిస్తామని చెప్పింది. కానీ ప్రస్తుతం కేవలం 5లక్షల వరకే వడ్డీ లేకుండా రుణం మంజూరు చేస్తూ, మిగతా రూ.15లక్షలకు పావలావడ్డీ వేస్తున్నది. మైనారిటీ వధువులకు రూ.1.6 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామనే మాట నీటిమీది రాతగానే మారింది. కేసీఆర్ కిట్లనూ బంద్ పెట్టింది.

హామీ: కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్
అమలు: కనీస ప్రయత్నం చేయలేదు
హామీ: ఇల్లు లేనివారికి ఇంటిస్థలం, రూ.6 లక్షలు
అమలు: ‘ఇందిరమ్మ ఇల్లు’ మంజూరుకే పరిమితం
హామీ: దళితబంధు సాయం రూ.12 లక్షలకు పెంపు
అమలు: పథకాన్నే ఎత్తివేసింది.
ఎన్నికలకు ముందు చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ‘అంబేదర్ అభయ హస్తం’ పేరుతో 12 హామీలను గుప్పించింది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. వెయ్యి రోజులు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదు. ఇల్లు లేని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికీ ఇంటిస్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు అందిస్తామని చెప్పింది. కానీ అమల్లో చేతులేత్తిసింది.
దరఖాస్తు చేసుకున్నవారికి ఇందిరమ్మ ఇల్లు కింద అందరి మాదిరిగానే రూ.5 లక్షల ఆర్థిక సాయం చేసి చేతులు దులుపుకొంటున్నది. ప్రతి గూడెం, తండాకూ ఏటా రూ.25లక్షలు అందిస్తామని ప్రకటించినా, ఒక్క పైసా విదల్చడం లేదు. ఎస్టీలకు మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించలేదు. దళితబంధు పథకం కింద అందిస్తున్న రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని రూ.12 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. పైగా ఎస్టీలకూ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ఊదరగొట్టింది.
కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్న పథకాన్ని కూడా ఊడగొట్టింది. కమ్యూనిటీహాళ్ల నిర్మాణం ఊసేలేదు. అసైన్డ్ భూములకు హక్కుల కల్పన, పోడుపట్టాల పంపిణీ, ఉన్నత విద్యనభ్యసిస్తే ఆర్థికసాయం అందజేత వంటివి మిథ్యగానే మిగిలిపోయాయి. 1/70, పెసా చట్టాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను, ఆదివాసీల హకులను కాలరాస్తూ గుట్టుగా ‘కుమ్రం భీం కన్జర్వేషన్ కారిడార్’ పేరిట జీవో 49ని తీసుకువచ్చింది. వ్యతిరేకత రావడంతో అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
హామీ: దివ్యాంగుల పెన్షన్ రూ.6వేలకు పెంపు
అమలు: ఒక్క రూపాయి కూడా పెంచలేదు
హామీ: మైనారిటీలకు రూ.వెయ్యి కోట్ల సబ్సిడీ రుణాలు
అమలు: గాలిలో కలిసిన హామీ
దివ్యాంగులకు సంబంధించి 6వేల పింఛన్ కలగానే మిగిలింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి వికలాంగులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వలేదు. కార్పొరేషన్లో క్యాలిపర్స్, ట్రైసైకిల్ తదితర ఉపకరణాల తయారీ యూనిట్లు అన్నీ మూతపెట్టి, కమీషన్ల కోసం ఏజెన్సీలకు అప్పగిస్తున్నది. దివ్యాంగుల కోసం ప్రత్యేకశాఖను ఏర్పాటు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను అటకెక్కించింది. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో 5శాతం రిజర్వేషన్‌ను మొక్కుబడిగానే అమలు చేస్తున్నది. సబ్సిడీపై నాసిరకం టు, త్రీవీలర్స్‌ను పంపిణీ చేసింది. వెహికల్స్ ఇచ్చి 8 నెలలు గడిచినా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కావడం లేదు. మరోవైపు వెహికిల్స్ అమరిక సరిగా లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. రిజిస్ట్రేషన్ లేకపోవడంతో కనీసం ఇన్సూరెన్స్ కూడా రాని దుస్థితి నెలకొన్నది.
ఇక గతంలో సబ్సిడీపై ఇచ్చే వెహికల్స్‌కు 10సార్లు ఫ్రీ సర్వీస్, ఇన్స్ట్రుమెంట్ కిట్లు ఇచ్చేవారు. ప్రస్తుతం అవేవీ లేకుండాపోయాయి. అదీగాక గతంలో 95శాతం వైకల్యమున్నవారికే వాహనాలను అందించగా, దానిని 40 శాతానికి కుదించి అనర్హులకు సైతం అంజేస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. మైనారిటీలకు సంబంధించిన హామీలు సైతం అటకెక్కాయి. మైనారిటీల బడ్జెట్ 4వేల కోట్లకు పెంచుతామని ప్రకటించి రూ.3,800కోట్లకు పరిమితమైంది. పోనీ ఆ మొత్తం ఖర్చు చేసిందా అంటే అదీ లేదు. రూ.180 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాల కోసం రూ.1,000 కోట్లు కేటాయింపు ఉత్తముచ్చటే అయ్యింది. సెట్విన్ పునరుద్ధరణ, ఇమామ్, మౌజమ్ల వేతనాల పెంపు, ఉన్నత విద్యావంతులకు ఆర్థిక సాయం అంతా బూటకమని తేలింది.

మొత్తం గురుకులాలు: 1,023
ప్రిన్సిపాళ్లు లేనివి: 352
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ అన్ని కలిపి దాదాపు 1,023కు పైగా గురుకులాలున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం తొలుత 5వ తరగతి నుంచి గురుకులాలను ఏర్పాటు చేసి క్రమంగా వాటిని ఇంటర్ వరకు, కొన్ని గురుకులాలను డిగ్రీ వరకు ఉన్నతీకరిస్తూ వచ్చింది. ప్రస్తుతం 352 గురుకులాలకు ప్రిన్సిపాళ్లు లేక, ఇన్చార్జులు కొనసాగుతున్నారు. ఎస్సీ గురుకులాల్లో దాదాపు 150 చోట్ల, బీసీ సొసైటీలో 70, మైనారిటీ సొసైటీలో 60, జనరల్ గురుకులాల్లో 22చోట్ల, ఎస్టీ గురుకులాల్లో 50చోట్ల రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ లేరు. ఎస్సీ గురుకులంలో దాదాపు 150మందికి పైగా కేర్ టేకర్లను తొలగించింది.
సైనిక్ స్కూల్స్, ఆర్మీ ప్రిప్రరేటరీకి డైరెక్టర్లు లేరు. డీఎల్ (డిగ్రీ లెక్చరర్స్), జేఎల్ (జూనియర్ లెక్చరర్స్), పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) స్థాయిలో భారీగా ఖాళీలున్నాయి. దీంతో గురుకులాల్లో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. మరోవైపు అన్ని సొసైటీల్లోనూ సీనియర్లను పక్కకునెట్టి జూనియర్లకు ఇన్చార్జుల బాధ్యతలు అప్పగిస్తున్నారని వివాదం చెలరేగింది. దీంతో నాణ్యత, జవాబుదారీతనం తగ్గిపోయిందని చెప్తున్నారు.
మరోవైపు శానిటేషన్ బిల్లులు, అద్దెలను విడుదల చేయని పరిస్థితి. పర్యవేక్షణ కొరవడడంతో ఫుడ్‌పాయిజన్ ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. దాదాపు వెయ్యిరోజుల్లో 130కుపైగా పైగా ఘటనలు నమోదు కాగా, వెయ్యిమందికిపైగా విద్యార్థులు దవాఖానల పాలయ్యారు. పలువురు మృతిచెందారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లోని విద్యార్థులకు మెస్ బిల్లుల చెల్లింపు, అద్దెల చెల్లింపు పూర్తిగా గాడితప్పింది.