హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రజల సమస్యలపై శాసనమండలిలో రాష్ట్రప్రభుత్వం ఏమాత్రం చర్చించలేదని ప్రతిపక్షనేత మధుసూదనాచారి విమర్శించారు. మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడుతూ శాసనమండలి సమావేశాలు అధికార పార్టీ ఎజెండాకే పరిమితం అయినట్టు తెలిపారు. అత్యంత ప్రాముఖ్యమైన రైతుభరోసాపై సభలో చర్చ పెట్టకుండా దాటవేశారని విమర్శించారు.
ఎన్నికల హామీల్లో రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ నిలువునా ముంచిందని మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామని వెల్లడించారు.