హైదరాబాద్, జూలై16 (నమస్తే తెలంగాణ): వరద వస్తేనే నీళ్లని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులేత్తేసింది. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలో వినియోగానికి అందుబాటులో ఉన్నవి 42.18 టీఎంసీలేనని తేల్చిచెప్పింది. అవికూడా తాగునీటికేనని స్పష్టంచేసింది. ఎల్ నినో ప్రభావంతో కాంటింజెన్సీ ప్రణాళికను ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా సహా అన్ని రిజర్వాయర్లలో కలిపి ప్రస్తుతం వినియోగానికి అందుబాటులో ఉన్న జలాలు 42.18 టీఎంసీలేనని సర్కార్ పేర్కొన్నది. గోదావరి బేసిన్లో 28 మీడియం,7 మేజర్ రిజర్వాయర్లు ఉండగా, వాటిలో డెడ్‌స్టోరేజీ కింద 37.21 టీఎంసీలు పోగా, ప్రస్తుతం వినియోగానికి 27.69 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని నివేదించింది.
కృష్ణా బేసిన్లో పరిస్థితి దారుణంగా ఉన్నది. కృష్ణా నదిపై తెలంగాణలో 2 మేజర్, 8 మీడియం రిజర్వాయర్లు ఉండగా, వాటన్నింటిలో ప్రస్తుతం డెడ్‌స్టోరేజీ కింద 136.53 టీఎంసీలు పోగా, వినియోగానికి అందుబాటులో ఉన్నది కేవలం 14.81 టీఎంసీలు మాత్రమే. ఎగువ నుంచి వరదలు వస్తే తప్ప అదనంగా నీళ్లిచ్చే అవకాశమే లేదని తెలిపింది. వెరసి ప్రస్తుతం ఉన్న నీళ్లు సైతం తాగునీటి అవసరాల కోసమేనని ఆ నివేదికలో తేల్చిచెప్పింది.

