Free Current | హైదరాబాద్, ఏప్రిల్13 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రజకులు, నాయీబ్రాహ్మణుల కోసం ప్రవేశపెట్టిన 250యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం అటకెక్కేందుకు సిద్ధమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 71వేల మంది రజకులు, 36 వేల మంది నాయీబ్రాహ్మణులు లబ్ధిపొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్తు నిధులను విడుదల చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో విద్యుత్తు పంపిణీ సంస్థల అధికారులు లబ్ధిదారులను వేధింపులకు గురిచేస్తున్నారు. విద్యుత్తు కనెక్షన్లను కట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు.
లాండ్రీలు, సెలూన్లకు 250యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ చెప్తూ వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యానికి గురిచేస్తున్నదని లబ్ధిదారులు మండిపడుతున్నారు. 2024-25 బడ్జెట్లో వాషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్‌కు రూ.150 కోట్ల బడ్జెట్‌ను, నాయీబ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్‌కు రూ.100 కోట్లను ప్రతిపాదించింది. అందులో రూ.79.85 కోట్లను విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ అందులో ఒక్కరూపాయిని కూడా ఫెడరేషన్లకు చెల్లించలేదు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా రెండు ఫెడరేషన్లకు కలిపి నిరుడి తరహాలోనే బడ్జెట్ ప్రతిపాదించి చేతులు దులుపుకున్నది. ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. వాషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్‌కు సంబంధించి రూ.300కోట్లకు పైగా నిధులు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తున్నది.
బిల్లులు చెల్లించాలంటూ విద్యుత్తుశాఖ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని నాయీబ్రాహ్మణులు, రజకులు చెప్తున్నారు. 250 యూనిట్లకు సంబంధించిన చార్జీని విద్యుత్తు బిల్లులో సబ్సిడీగా మాత్రమే చూపుతున్నారు తప్ప, ఆ మొత్తాన్ని ప్రధాన బిల్లు నుంచి మినహాయించడం లేదు. దీంతో వేలల్లో బిల్లులు పెండింగ్ ఉన్నట్లు చూపుతున్నది. బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామంటూ అధికారులు వేధిస్తున్నట్టు లబ్ధిదారులు చెప్తున్నారు.
లాండ్రీ, సెలూన్లకు సంబంధించిన విద్యుత్తు కనెక్షన్ లబ్ధిదారుని పేరిట మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది. అద్దెగృహంలో షాపులను నిర్వహిస్తున్న లాండ్రీ, సెలూన్ యజమానులు సదరు ఇంటి యజమానితో చేసుకున్న లీజ్, రెంటల్ అగ్రిమెంట్ ధ్రువపత్రాలను సమర్పించి ఉచిత విద్యుత్తు యూనిట్‌కు కనెక్షన్‌ను తీసుకున్నారు. షాపుల అడ్రస్‌లను మార్చుకున్నప్పుడు తిరిగి కనెక్షన్లను ఇవ్వడంలేదని లబ్ధిదారులు మండిపడుతున్నారు. అలాగే కొత్త కనెక్షన్లను ఇవ్వడంలేదని చెప్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌నే రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
250యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం లబ్ధిదారులను విద్యుత్తు అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న రజక, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్లకు సంబంధించిన బిల్లులను సత్వరమే విడుదల చేయాలి. తద్వారా అధికారుల వేధింపులను ఆపాలి. షాపు నిర్వహణ ప్రదేశాన్ని మార్చకున్న చోటుకు విద్యుత్తు మీటర్లను మార్చాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే కొత్త కనెక్షన్లను కూడా మంజూరు చేయాలి.
– కొండూరు సత్యనారాయణ, ఎంబీసీ సంఘం రాష్ట్ర కోకన్వీనర్