Telangana | సిరిసిల్ల రూరల్, జూన్ 3 : ‘ఓ ఆసామి, యాజమానికి మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారు ఆసామి ఖాతాలో బకాయిలను జమ చేసింది. దీంతో వారిద్దరి మధ్య కొత్త పంచాయితీ మొదలైంది. లెక్కలు చేసుకుందాం.. ముందు పడిన డబ్బు పట్టుకురా అని యజమాని ఆదేశిస్తే.. ముందు లెక్కలు చేసి చెప్తేనే డబ్బు పట్టుకచ్చిస్తా.. లేకుంటే ఇచ్చేది లేదని సదరు ఆసామి తెగేసి చెప్పాడు.. ఇలా ఇద్దరి మధ్య కాంగ్రెస్ సర్కారు కొత్త కిరికిరి పెట్టింది.’
ఇప్పటిదాకా సాఫీగా సాగిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కాంగ్రెస్ సర్కారు చిచ్చురాజేసింది. నిన్నమొన్నటిదాకా ఇటు యజమానులు, అటు ఆసాములకు ఇబ్బంది లేకుండా ఉన్న విధానాన్ని మార్చి ఇరువర్గాల మధ్య కొత్త పంచాయితీ తెచ్చిపెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీరాగానే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడం, కొత్త ఆర్డర్లు లేకపోవడంతో కార్ఖానాలు మూతపడ్డాయి.
ఆరు నెలలుగా వస్త్ర పరిశ్రమలోని నేతకార్మికులు, అనుబంధకార్మికులకు పనిలేకుండా పోయింది. ఈ దుస్థితిలో ఆరుగురు నేత కార్మికులు బలవన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్, కార్మిక సంఘాల ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చి ఒకసారి రూ.50 కోట్లు, ఎంపీ ఎన్నికల ముందు మరో రూ.100 కోట్ల బకాయిలు విడుదల చేసింది. పలు ప్రభుత్వ యూనిఫాం ఆర్డర్లు ఇచ్చింది. ఇప్పటి దాకా బాగానే ఉన్నా ఆసాముల ఖాతాల్లో బకాయిలు జమ చేయడంతో యజమానులకు, ఆసాములకు మధ్య వివాదం మొదలైంది.
సిరిసిల్లలో సుమారు 30 మంది యాజమానులు, 1700 మందికిపైగా ఆసాములున్నారు. గతంలో యజమానులకు నేరుగా నగదు చేరేది. దీంతో ఎలాంటి సమస్యా లేకుండా యజమానులు, అసాముల సమన్వయంతో వస్త్రపరిశ్రమ నడిచింది. ప్రస్తుత ప్రభుత్వం ఆసాముల ఖాతాల్లో జమచేయడంతో ఇరువర్గాల మధ్య పంచాయితీలు మొదలయ్యాయి. పలువురు అసాములు తమ ఖాతాలో జమైన డబ్బును యజమానులకు ఇవ్వకపోగా కొన్ని మెలికలు పెడుతున్నారు. దీంతో కొత్త సమస్యలు వచ్చి యజమానులు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని పంచాయితీలు ఠాణా దాకా వెళ్లినట్లు సమాచారం. మొన్నటిదాకా యజమానులు చెప్పినట్టు ఆసాములు నడుచుకునే వారు. ఇప్పుడు ఆసాములు ససేమిరా అనడంతో ఏం చేయాలో తోచక యాజమానులు పూర్తి బకాయిలు విడుదలయ్యేదాకా ఓపిక పడుదామని వేచి చూస్తున్నారు.
పూర్తి బకాయిలు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అరకొర విడుదల చేసి చాట్లో తవుడు పోసి కొట్లాట పెట్టినట్టు చేసిందని అటు యజమానులు, ఇటు ఆసాములు వాపోతున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్కు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అండగా ఉందనే అక్కసుతోనే యజమానులకు, ఆసాములకు, కార్మికులకు మధ్య కిరికిరి పెట్టేలా కాంగ్రెస్ సర్కారు వ్యవహరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.