హైదరాబాద్, జూన్ 47(నమస్తే తెలంగాణ): కొన్నది తక్కువ… ప్రచారం ఎక్కువ.. ఇదీ యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సర్కారు గొప్పలు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తమ ప్రభుత్వం రైతుల నుంచి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిందంటూ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు గొప్పలు చెప్తున్నారు. కానీ ధాన్యం కొనుగోళ్లపై వాస్తవ లెక్కలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. యాసంగి సీజన్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధికంగా 92.39 లక్షల టన్నులు కొనుగోలు చేస్తే కాంగ్రెస్ సర్కారు 72 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. కాంగ్రెస్ సర్కారు రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్టు ఎలా అవుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ యాసంగిలో 137 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో సుమారు 80-85 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని తొలుత అంచనా వేసింది. కానీ కొనుగోలు లక్ష్యాన్ని పౌరసరఫరాలసంస్థ 70.13 లక్షల టన్నులకు తగ్గించింది. ఇప్పుడు 72 లక్షల టన్నులు కొనుగోలు చేసి.. లక్ష్యానికి మించి కొనుగోలు చేశామంటూ ప్రకటించుకుంటున్నది. వాస్తవానికి ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల అంశంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అకాల వర్షాలు.. సర్కారు నిర్లక్ష్యంతో నష్టపొయారు. సర్కారుపై ఆశలు సన్నగిల్లి కొందరు రైతులు తక్కువధరకే ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను తగ్గించేందుకు కావాలనే నిర్లక్ష్యం చేసిందనే విమర్శలు వినిపించాయి. ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటే 80 లక్షలకు పైగా ధాన్యం వచ్చేదని పౌరసరఫరాలసంస్థ అధికారులు చెప్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం రైతుల నుంచి పుట్ల కొద్ది వడ్లు కొనుగోలు చేసింది. 2018-19లో రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు కేవలం 37.05 లక్షల టన్నులు మాత్రమే. బీఆర్ఎస్ సర్కారు ధాన్యం కొనుగోలును భారీగా పెంచింది. 2023-24లో యాసంగి ధాన్యం కొనుగోళ్ల సమయానికి కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు మందగించాయి. నిరుడు యాసంగిలో 47.97 లక్షల టన్నులకే పరిమితమైంది. ఇక ఈ యాసంగిలో 72 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్టు గొప్పలు చెప్తున్న సర్కారు.. నిరుడు యాసంగిలోనూ కొనుగోళ్లు భారీగా ఎందుకు తగ్గాయో సమాధానం చెప్పాలని రైతుసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.