Serilingampally | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో చెలరేగుతున్న ఓ అక్రమార్కుడితో చేయి కలిపి శేరిలింగంపల్లి జోన్ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది. కష్టార్జితంతో ఇల్లు కట్టుకునేందుకు అన్ని అనమతులు పొందిన ఓ యజమానిని వివాదస్పద బిల్డర్ కోసం వేధించడం చర్చనీయాంశమవుతున్నది. గచ్చిబౌలి ఎఫ్‌సీఐ ఎంప్లాయిస్ కాలనీ సర్వే నంబర్ 124,125, ప్లాట్ నంబర్ 84లోని 708 గజాల స్థలాన్ని వీ దేవరాజ్, వీ కల్యాణి పేరుతో 2022 సంవత్సరంలో జీహెచ్ఎంసీకి నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. అంతా పరిశీలించాక టౌన్‌ప్లానింగ్ అధికారులు అనుమతి మంజూరు చేశారు. దీంతో ఇటీవల దేవరాజ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇదే కాలనీ హౌజింగ్ సొసైటీపై పెత్తనం చలాయిస్తున్న బిల్డర్ శ్రీధర్‌రావు కన్ను ఈ స్థలంపై పడింది. అక్కడి నుంచి పనులను అడ్డుకోవడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో దేవరాజ్ గత నెల 27న శ్రీధర్‌రావుపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే(అధికారపార్టీ) అండతో శ్రీధర్‌రావు చెలరేగిపోయాడు. ఆయన ఆదేశాలతో అధికారులు దేవరాజ్ నిర్మాణ స్థలంలో ఫెన్సింగ్‌ను జేసీబీతో తొలగించారు. ఇందేంటని ప్రశ్నిస్తే తమకు ఫిర్యాదు అందిందని అనుమతినిచ్చిన టౌన్‌ప్లానింగ్ అధికారులు చెప్పడం కొసమెరుపు. ఈ క్రమంలో దేవరాజ్‌పై తరచూ వేధింపులు ఎక్కువయ్యాయి. అన్ని అనుమతులతో నిబంధనలకు అనుగుణంగా పనులు మొదలుపెడితే కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని దేవరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని సీపీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.