హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఓపెన్ కాస్ట్ మైనింగ్‌తో ములుగు జిల్లా రామప్ప దేవాలయానికి ముప్పు వాటిల్లుతుందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రామప్పకు యునెస్కో ఇచ్చిన గుర్తింపు రద్దయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క సీఎం దృష్టికి తీసుకెళ్లి బొగ్గుగని తవ్వకం ఆలోచనను విరమింపజేయాలని కోరారు. తెలంగాణ భవన్లో గురువారం ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, టీ రవీందర్రావు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 2012లో రామప్ప దేవాలయం సమీపంలో బొగ్గు గని తవ్వకాలను చేపట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాడు దానిని తీవ్రంగా వ్యతిరేకించారని పోచంపల్లి గుర్తుచేశారు. రామప్ప చెరువులకు దేవాదుల నీటిని తరలించేందుకు సొరంగాలు తవ్వాలన్న ఇంజనీర్ల ప్రతిపాదనకు ప్రత్యామ్నాయంగా పైప్‌లైన్ ద్వారా నీటిని తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చే విధంగా కృషి చేశారని తెలిపారు. రామప్ప దేవాలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఎన్నో నిధులు వెచ్చించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ రామప్ప ఆలయం సమీపంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్‌ను చేపట్టడానికి హడావుడిగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పేలుళ్లు చేపడితే దేవాలయానికి ప్రమాదం జరుగుతుందని చెప్పారు. ఒక వేళ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే కోర్టుకు వెళతామని, ఆందోళనకు కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రామప్ప, సమ్మక్క సారలమ్మ ఆలయాలు, భద్రకాళి, వేయిస్తంభాల దేవాలయం ఎంతో ప్రాముఖ్యమైనవని ఎమ్మెల్సీ రవీందర్రావు అన్నారు. చారిత్రక ఆనవాళ్లను చెరిపేయవద్దని కోరారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి ఓపెన్ కాస్ట్ మైనింగ్‌తో తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే జిల్లా ప్రజలు సహరించని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.