హైదరాబాద్, మార్చి 31 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిధిలోని 400 ఎకరాల భూముల్లో పర్యావరణ విధ్వంసానికి తెగబడుతున్న రేవంత్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ద్వంద్వ వైఖరిని కూడా పలువురు మేధావులు, పర్యావరణ నిపుణులు, విశ్లేషకులు తూర్పారబడుతున్నారు. ప్రాంతాలను బట్టి రాహుల్ ‘పర్యావరణ’ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.
కేరళ, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమతిస్తే పర్యావరణ విధ్వంసం జరుగుతుందంటూ ప్రధాని మోదీకి లేఖ రాసిన రాహుల్‌కు.. తమ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలోని హెచ్‌సీయూలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం కనిపించడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కేరళ, గుజరాత్లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టే.. పర్యావరణం ముసుగులో రాహుల్ రాజకీయాలు చేస్తున్నారా? అంటూ నిలదీస్తున్నారు.
కేరళ, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఆఫ్‌షోర్ మైనింగ్ చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల అనుమతులనిచ్చింది. ఈ మేరకు టెండర్లు పిలిచింది. అయితే, ఈ మైనింగ్ వల్ల పర్యావరణానికి ముప్పు పొంచి ఉన్నదంటూ ప్రధాని మోదీకి రాహుల్‌గాంధీ సోమవారం ఓ లేఖ రాశారు. ఆఫ్‌షోర్ మైనింగ్ కారణంగా సముద్ర జీవులు, కోరల్ రీఫ్స్, తీరాన్ని ఆనుకొని ఉన్న చెట్లకు తీరని నష్టం జరుగుతుందని, మత్స్య సంపద తగ్గి సముద్రాలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నవారు రోడ్డున పడే ప్రమాదం ఉన్నదని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆఫ్‌షోర్ మైనింగ్ వల్ల పర్యావరణ, సామాజిక-ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయడానికి కఠినమైన శాస్త్రీయ అధ్యయనాలు అవసరమని పేర్కొన్న రాహుల్.. పర్యావరణంపై ప్రభావాన్ని అంచనా వేయకుండా తీసుకొన్న ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. కాగా కేరళ, గుజరాత్ ఆఫ్‌షోర్ మైనింగ్‌పై ఇంతగా ఆందోళన చెందుతున్న రాహుల్.. హెచ్‌సీయూలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై నోరు మెదపరా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కేరళ, గుజరాత్లో కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నదని, అందుకే పర్యావరణాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారా? అంటూ నిలదీస్తున్నారు. ఒకవేళ, రాహుల్‌కు పర్యావరణం మీద నిజంగా ప్రేమ ఉంటే.. హెచ్‌సీయూలో రేవంత్ సర్కారు కొనసాగిస్తున్న దమనకాండను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పుడే కాదు.. గతంలోనూ రాహుల్‌గాంధీ పర్యావరణ రాజకీయ ఆందోళనలకు పిలుపునిచ్చారు. ముంబై నగరానికి ఊపిరితిత్తులుగా పిలిచే (లంగ్స్ ఆఫ్ ముంబై) ఆరే ఫారెస్ట్ గుండా మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్‌సీఎల్) నిర్ణయించింది. అయితే, ఈ మార్గంలో నిర్మాణాన్ని చేపడితే వేలాది చెట్లను తొలగించాల్సి ఉంటుంది. జీవవైవిధ్యం దెబ్బతినడంతో పాటు ఎన్నో వేల రకాల జీవజాతులు తమ ఆవాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. పర్యావరణం కూడా దెబ్బతింటుంది. దీంతో పర్యావరణ ప్రేమికులతో సహా రాహుల్‌గాంధీ కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారు.
పర్యావరణాన్ని దెబ్బతీయొద్దంటూ ప్రసంగాలిచ్చారు. ఇక, ఛత్తీస్‌గఢ్‌లోని హస్దేవ్ అరండో అభయారణ్యంలో కేంద్రం అనుమతులివ్వడంతో అదానీ కంపెనీ బొగ్గు వెలికితీత పేరిట యథేచ్ఛగా మైనింగ్‌కు తెగబడింది. దీంతో పచ్చని చెట్లు సహా అక్కడి జీవజాలమంతా బుగ్గిగా మారుతున్నది. అదానీకి ఇచ్చిన కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకోవాలంటూ రాహుల్ నిరసనలు కూడా చేశారు. మిగతా ప్రాంతాల్లో ఇలా నిరసనలు చేసిన రాహుల్.. తమ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే నోరుమెదపకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.